పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/299

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరిక ఉండదు. వీళ్ళు ఇతరులు తమకు అపకారం చేసినా వాళ్ళమీద పగతీర్చుకోవాలి అనుకోరు. తోడివారితో ఒద్ధికగా జీవిస్తారు.

వినములు భూమికి వారసులౌతారు. యూదులకు వారసభూమి పాలస్తీనా దేశం. కనుకనే కీర్తన 37,11. “దీనులు ప్రభువు దేశాన్ని స్వాధీనం జేసికొంటారు” అని చెప్తుంది. కాని మన వారసభూమి పాలస్తీనా దేశంగాదు, మోక్షం. కనుక వినములు మోక్షభూమిని వారసంగా పొందుతారు.

అన్వయం

ఈ ధన్యవచనం ప్రకారం మనం శత్రువుమీద పగతీర్చుకోవడానికి పూనుకోగూడదు. ఆ పని దేవునికి వదలి వేయాలి. దేవుడు శత్రువుల బుద్ధి మార్చాలని మాత్రం వేడుకోవాలి. మన తరపున పొగరు పనికిరాదు. వినయంగా ఉండాలి. ఇతరులతో మెలిగేప్పుడు మృదువుగా, ప్రేమపూర్వకంగా, ఓర్పుతో వ్యవహరించాలి. దురుసుతనం పనికిరాదు. సాధుశీలుడు, శాంతస్వభావుడు ఐన క్రీస్తు మనకు ఆదర్శం కావాలి.

ఈ ధన్యవచనం ఉగ్రవాదాన్ని హింసనూ ఖండిస్తుంది. శాంతిని సామరస్యాన్ని పెంపొందించుకోవాలని చెప్తుంది. ఇంకా ఎప్పుడూ వాదంలో మనమే గెలవాలని కోరుకోగూడదు. ఇతరులు మనకు కీడు జేసినా మనం తిరిగి వారికి కీడు చేయకూడదు. మాటకు మాట వడ్డించకూడదు. మన తెలివివల్లగాక దైవబలం వలన విజయాలు సాధిస్తున్నామనుకొని దేవునికి సదా కృతజ్ఞలమై యుండాలి. దేవునికి లొంగివుండాలి. తోడివారికి ప్రతికూలంగా గాక, అనుకూలంగా మెలగాలి.

4. నీతి కొరకు ఆకలిదప్పలు - సంతృప్తి చెందడం

బైబుల్లో నరుని నీతి అంటే నరుడు పుణ్యకార్యాలు చేయడం

- మత్త 5,20, దేవుని నీతి అంటే దేవుని రక్షణం -6,33. కనుక ఈ ధన్య వచనంలోని "నీతి" దేవుడు దయచేసే రక్షణమే. ఆకలిదప్పలు కొనడమంటే గాఢంగా వాంఛించడం. కావున, దేవుని రక్షణం కొరకు తపించిపోయేవాళ్ళు భాగ్యవంతులు అని భావం.

ఈలాంటి వాళ్ళ సంతృప్తి చెందుతారు. అనగా దేవుడు వారికి మోక్షాన్ని దయచేసి వారిని సంతృప్తిపరుస్తాడని భావం. యూదులు మోక్షాన్నితిని త్రాగే విందుగా భావించారు. దేవుని రక్షణాన్ని కోరేవాళ్ళ మోక్షంలో తనివిదీర తిని త్రాగి సంతృప్తి చెందుతారని ఫలితార్థం. దేవుని రక్షణాన్ని కోరేవాళ్ళకు ఆ రక్షణం పరిపూర్ణంగా సిద్ధిస్తుందని క్రీస్తు భావం. వారికిక ఆకలిదప్పలు ఉండవు. సూర్యుడుగాని వేడిమిగాని వారిని దహింపవు. సింహాసనం మధ్యనుండే గొర్రెపిల్ల వారికి కాపరి ఔతుంది అంటుంది దర్శన గ్రంథం - 7,16.

మనలో మూడు రకాల నీతి కన్పించాలి. మనం దేవుని నీతిని (రక్షణం) కోరాలి. మన నీతి (పుణ్యక్రియలు) విస్తరిల్లాలి. తోడివారిపట్ల నీతితో (న్యాయం) ప్రవర్తించాలి.