పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/297

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దేవుడు పసిబిడ్డలకు దైవ రహస్యాలను ఎరిగిస్తాడు- మత్త 11,25. ఈ వాక్యంలో పసిబిడ్డలంటే వినయంగా, సరళంగా వుండేవాళ్ళు. దేవుడు ఈలాంటి వాళ్ళకు దైవావిష్కరణను తెలియజేస్తాడు. గర్వాత్ములకు దేవుడు తెలియడు.

ప్రభువు తన దాసురాలి దీనావస్థను కటాక్షించాడు - లూకా 1,48. మరియ దీనురాలు. కనుకనే దేవుడు ఆమెను ఎన్నుకొన్నాడు. క్రీస్తుకూడ దీనుడు - మత్త 11,29. వీరి లాగే మనంకూడా దీనులం కావాలి.

పదవులు, అధికారాలు ధనం చూచుకొని పొంగిపోవడం, గర్వం, ధీమా మొదలైనవి ఈ ధన్యవచనానికి వ్యతిరేక గుణాలు. వినయవంతులైనవాళ్ళు ఇతరుల చేత సేవలు చేయించుకోరు. తామే స్వయంగా సేవలు చేస్తారు. జీవితంలో కొన్ని కష్టాలు అనుభవించడానికి సిద్ధంగా వుంటారు. సుఖభోగాలను కోరుకోరు. పేదరికాన్నీ అది తెచ్చిపెట్టే బాధలనూ భరించడానికి వెనుకాడరు. క్రీస్తు పేదరికంలో సంతోషంతో పాలుపంచుకొంటారు. తోడివారికి సాయం జేయడానికీ, వారి అక్కరలు తీర్చడానికి తయారుగా వుంటారు . మొదటి ధన్యవచనం అతి ముఖ్యమైంది. ప్రభువు ఈ ఒక్క ధన్యతనే ఎన్మిది విధాలుగా చెప్పకుంటూ పోయాడు.

2. శోకార్తులు - ఓదార్పు పొందడం

శోకించడం దేనికి? లోకంలోని దుష్టత్వాన్ని జూచి. బలవంతుల పీడనానికి గురై, శోకించేవారిని ఓదార్చడానికి యావే నన్ను పంపాడు అంటాడు యెషయా 61,2. 53 శోకించేవాళ్ళు పేదలు, దీనులు, ఖైదీలు, బానిసలు మొదలైనవాళ్ళు నూత్న వేదంలో క్రీస్తు యెరూషలేము దుర్మార్గాన్ని చూచి దుఃఖించాడు- లూకా 19,41. లాజరు మరణానికి కంటతడి పెట్టాడు- యోహా 11,35.

మన పాపాలకు దుఃఖపడ్డం కూడ శోకించడమే. పేత్రు తన పాపానికి వెక్కివెక్కి యేడ్చాడు - లూకా 22,62. "పాపాత్ములారా! విచారించండి. రోదించండి. నవ్వుటకు బదులు దుఃఖించండి. దేవుని యెదుట వినములు కండి. అప్పుడు అతడు మిమ్ము ఉద్ధరిస్తాడు అంటుంది యాకోబు జాబు–4,8–10. ఇప్పడు మనం పాపసంకీర్తనం చేసికొనేప్పడెల్ల శోకిస్తూనే వుంటాం. దేవునితో సంబంధం కలిగినదైనప్పుడు మన శోకం పవిత్రమైన దౌతుంది. నిర్మలమైన మన శోకాన్ని చూచి దేవుడు మనలను ఓదారుస్తాడు.

దేవుని ఓదార్పు ఏలా వుంటుంది? అతడు దుఃఖించేవారికి బుగ్గికి బదులుగా పూలదండనిస్తాడు. శోకవస్తాలకు మారుగా ఆనంద తైలాన్నిస్తాడు. విచారించేవాళ్ళు స్తుతి గీతాలు పాడేలా చేస్తాడు - యొష 61,3. సింహాసనం మధ్యనున్న గొర్రెపిల్ల శోకించే వారికి కాపరి ఔతాడు. వారిని జీవజలాల వద్దకు తీసికొని పోతాడు. వారి నేత్రాల్లోని బాష్పబిందువులను తుడిచివేస్తాడు- దర్శన 7,17.