పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/296

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5 దయామయులు - దయను పొందడం
6 నిర్మల హృదయులు - దైవదర్శనం పొందడం
7 శాంతిస్థాపకులు - దేవుని కుమారులు కావడం
8 హింసితులు - దైవరాజ్యాన్ని పొందడం

తొలి నాలు ధన్యవచనాలు మనకు దేవునిపట్ల వుండే సంబంధాన్ని సూచిస్తాయి.మలి నాలు మనకు తోడి నరులపట్ల వుండే సంబంధాన్ని తెలియజేస్తాయి.

క్రీస్తు స్వయంగా ఈ ధన్యవచనాలను పాటించాడు. దైవరాజ్యాన్ని బహుమతిగాపొందాడు. అసలు అతడే ధన్యవచనం. మనంకూడ వీటిని పాటించాలి. బైబులు బోధలసారం, క్రైస్తవ జీవితం అంతా వీటిల్లో ఇమిడే వుంది. ఇక, ఒక్కోధన్యవచనాన్ని విపులంగాపరిశీలిద్దాం.

1. దీనాత్ములు - దైవరాజ్యం

ఈ ధన్యవచనం పేర్కొనే దీనాత్ములు ఎవరు? యిప్రాయేలీయుల్లో “హనవిం” ෂබී వర్గంప్రజలు వుండేవాళ్ళు వీళ్ళు తరచుగా పేదలు, బాధలకు గురయ్యేవాళ్ళు.ఐనా దేవునిపై ఆధారపడి జీవించారు. పేదరికం, వినయం, కష్టాలకు గురికావడం, దైవభక్తి వీరి ప్రధాన లక్షణాలు. పొగరుబోతు తనమీద తాను ఆధారపడతాడు. నాకు నేను చాలుదును అనుకొంటాడు. కాని వినయవంతుడు దేవునిమీద ఆధారపడతాడు. పై హనవిం అనే ప్రజలనే ఈ ధన్యవచనం దీనులు అని పిలుస్తుంది. వీరిని గూర్చే జఫన్యా 2,3 ఈలా చెప్తుంది. "దేశంలోని వినయవంతులైన ప్రజలారా! దేవుని ఆజ్ఞలను పాటించే జనులారా! మీరు ప్రభువు వద్దకు రండి, న్యాయాన్ని పాటించండి, వినయాన్ని అలవర్చుకొనండి".

ఈ దీనులు దైవరాజ్యాన్ని పొందుతారు. అనగా వీళ్ళ దేవుని పరిపాలనం క్రిందికి వస్తారు. ప్రభువు అండదండలు వీరికి లభిస్తాయి. వీళ్ళు ఇక్కడ పాక్షికంగా పరలోకంలో పూర్తిగా దైవరాజ్యాన్ని పొందుతారు. ఇంకా వీళ్ళ ప్రభువు సందేశాన్ని విని దైవరాజ్యంలో చేరతారు. ఈ దైవ రాజ్యం ఈలోకంలో తిరుసభ, పరలోకంలో మోక్షం. కనుక వీళ్ళ ఈ లోకంలో జీవిస్తూ కూడ మోక్షంమీద మనసుపెట్టి వుంచుతారు.

అన్వయం

మొదటి ధన్యవచనాన్ని ఇప్పడు మనం ఏలా జీవిస్తాం? మీరు చిన్న బిడ్డల్లా ఐతేనే తప్ప పరలోక రాజ్యంలో చేరరు అన్నాడు క్రీస్తు — మత్త 18, 3. చిన్న పిల్లలు అన్నిటికీ తల్లిదండ్రులమీద ఆధారపడతారు. ఆలాగే మనంకూడ దేవునిమీద ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. మన పొగరును అణచుకొని వినయం అలవర్చుకోవాలి. కష్టాలు పేదరికం మొదలైన వాటిని సహించాలి. దేవుని ఆదరణను నమ్మాలి. దైవభక్తి మనకు ప్రధాన గుణం కావాలి.