పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/295

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14. అష్టభాగ్యాలు

బైబులు భాష్యం - 158

మత్తయి సువిశేషం 5–7 అధ్యాయాలకు "పర్వత ప్రసంగం” అని పేరు. ఇది నూత్న వేదంలోకెల్ల ప్రసిద్ధ భాగం. దీనికి క్రీస్తు గీత లేక క్రీస్తు ధర్మశాస్త్రం అనిపేరు వచ్చింది. ఈ భాగం క్రీస్తు నైతిక సూత్రాల సంపుటి.

మత్తయి దృష్టిలో క్రీస్తు నూత్న మోషే ఇద్దరూ కొండమీద ధర్మశాస్తాన్ని జారీ చేసారు. మోషే పుస్తకాలు ఆదిపంచకం. మత్తయి గ్రంథంకూడ ఐదుపన్యాసాలుగా వుంటుంది.

లూకా మైదాన ప్రసంగం 29 వచనాలు మాత్రమే – 6,17-49. కాని మత్తయి పర్వత ప్రసంగం 107 వచనాలు. అనగా అతడు ఈ యంశాన్ని పెంచి వ్రాసాడు. ఈ భాగం నూత్న వేదానికి గుండెకాయ లాంటిది.

ఇక, పర్వత ప్రసంగంలో అష్టభాగ్యాలు ఒక భాగం. వీటికే ధన్యవచనాలు అనికూడ పేరు. ఇవి ఇహలోక భాగ్యాలనూ పరలోక భాగ్యాలనూ గూడ సూచిస్తాయి. పూర్వ నూత్న వేదాల్లో ధన్యవచనాలు చాలా వున్నాయి. నరులు ధన్యులు ఔతారని చెప్పేదే ధన్య వచనం. ఊదాహరణకు, ప్రభువును నమ్మే నరుడు ధన్యుడు అంటుంది కీర్తన 40,4.

ఈ వాక్యాల్లో ఒక ధన్యతా, ఒక బహుమానమూ కలసిపోతాయి. ఉదాహరణకు దీనాత్మలు ధన్యులు. వాళ్ళు దైవరాజ్యాన్ని పొందుతారు. ఇక్కడ దీనత ధన్యవచనం. దైవరాజ్యాన్ని పొందడం బహుమతి.

ఈ యష్టభాగ్యాలు ఈ లోక్షంలో సంపూర్ణంగా నెరవేరవు. వీటిని ఈ లోకంలో కొంతవరకు సాధిస్తాం. పరలోకంలో సంపూర్ణంగా పొందుతాం.

ధన్యవచనాలు ఎన్ని? లూకా నాల్లింటిని పేర్కొన్నాడు. అవి పేదలై యుండడం, శోకించడం, ఆకలిదప్పులు, హింసలు అనుభవించడం. మత్తయి ఇంకా నాలు చేర్చి మొత్తం 8 చేసాడు. అతడు చేర్చిన నాలు వినమత, దయ, నిర్మలత్వం, శాంతిస్థాపనం. మొత్తం 8 ధన్యతలూ, 8 బహుమానాలు వున్నాయి.

కాని 8 ధన్యవచనాలు ఒకే ధన్యవచనం అనాలి. అది వినయం! దేవునిపై ఆధారపడి జీవించడం. ఆలాగే ఎన్మిది బహుమానాలు కూడ ఒకే బహుమానం. అది దైవరాజ్యాన్ని పొందడం. ఎన్మిది ధన్యతలూ, ఎన్మిది బహుమానాలూ క్రమంగా ఇవి.

1. దీనాత్మలు - దైవరాజ్యాన్ని పొందడం
2. శోకార్తులు - ఓదార్పు పొందడం
3. వినములు - భూమికి వారసులు కావడం
4. నీతికొరకు ఆకలిదప్పలు - సంతృప్తి చెందడం