పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/293

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35. నేనింతటివాణ్ణి అయ్యానంటే అదంతా దేవుని చలవవల్లనే. - 1కొ 15.10.

పౌలు పొట్టివాడట. ఐనా చాల గట్టివాడు. అతడు కొరింతు, ఫిలిప్పి, కోలోస్సా మొదలైన నానాపట్టణాల్లో క్రీస్తును బోధించాడు. క్రైస్తవ సమాజాలు స్థాపించాడు. తిమోతి, తీతు మొదలైన శిష్యబృందాన్ని తీర్చిదిద్దాడు. తన విశ్వాసులకు క్రీస్తును వివరిస్తూ 14 జాబులు వ్రాసాడు. పేత్రుతో సమానమైన ప్రేషితుడని పేరుగాంచాడు. క్రీస్తు అతనికి చాలసార్లు ప్రత్యక్షమయ్యాడు కూడ. ఇన్ని మహత్తర కార్యాలు సాధించినా పౌలు ఉబ్చిపోలేదు. నేనింతవాడ్డి, అంతవాడ్డి అని చెప్పకోలేదు. దేవుని చలువ వల్లనే ఒకపాటివాణ్ణి అయ్యానని సవినయంగా పల్మాడు. మనం జీవితంలో ఏదో కొంచెం సాధిస్తాం. కాని వెంటనే మన డప్ప మనమే వాయించుకొంటాం. నేటి పత్రికల్లో, సమావేశాల్లో సమాచార సాధనాల్లో ఈ బడాయి అధికంగా కన్పిస్తూంటుంది. తననూ భగవంతుణ్ణి అర్థం చేసికొన్న నరుడు గర్విష్టి కాడుగదా, వినయవంతు డౌతాడు.

36. నరుడు స్నేహితునితో మాటలాడినట్లుగా యావే మోషేతో ముఖాముఖిమాటలాడేవాడు - నిర్గ 33, 11.

మనం స్నేహితునితో మాటలాడేపడు మరో మధ్యవర్తిద్వారా మాటలాడం, నేరుగా మాటలాడేస్తాం. ప్రభువు మోషేతో కూడ అలా నేరుగా మాటలాడేవాడు. ఇతర భక్తులతో ఐతే అతడు ప్రవక్తల మధ్యవర్తిత్వం ద్వారా మాటలాడేవాడు. కాని మోషేతో అలాకాదు. అనగా మోషేకు ప్రభువు పట్ల అంత పరిచయమూ, చనువూ వుండేవని భావం. ఇక నూత్న వేదంలో ప్రభువు మనలను కూడ తన స్నేహితులనే పేర్కొంటాడు- యోహను 15 15. ఆ ప్రభువు మనతోను, మనం ఆ ప్రభువుతోను నేరుగా మాటలాడతాం. ఇది దేవుని మిత్రులకేగాని అన్యులకు లభింపని దొడ్డభాగ్యం.

37. నరుడు జంతుజాలాన్నంతటినీ మచ్చిక జేసికొన్నాడు కాని నాలుకనుమాత్రం సాధువుగా జేసికొన్నవాడు ఒక్కడూ లేడు - యాకో 3,8.

చిన్న నిప్పరవ్వే కారుచిచ్చు ఔతుంది. నాలుకా ఈలాంటిదే. నిప్ప రవ్వ అడవి నంతటినీ కాల్చివేసినట్లే అది మన జీవితాన్నంతటినీ కాల్చివేస్తుంది. నాలుకంతటి దోసకారి మరొకటి లేదు. నరుడు పాములు, పెద్దపులులు మొదలైన విషజంతువులను మచ్చికజేసికొంటున్నాడు. కాని నాలుక దుష్టజంతువు లన్నిటికంటె దుష్టమైంది. దీనిని లోబరచుకొన్నవాడు లేడు. చిన్నకల్లెం గుర్రాన్నీ చిన్న చుక్మాని ఓడనూ నడిపిస్తుంది. అలాగే నాలుక చిన్న అవయవమే ఐనా నరుడంతటివాణ్ణి నడిపిస్తుంది - ఇవి నాలుకను గూర్చి యాకోబు జాబు చెప్పేకొన్ని భావాలు. ఈ భావాలను విన్నాక మన నాలుకను ఏలా వాడుకొంటున్నామో కూడ కొద్దిగా ఆలోచించి చూచుకొందాం.