పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/292

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32. నా రోజులింకా ప్రారంభం కాకమునుపే అవి యిన్ని యని నీవు ముందుగానే నిర్ణయించావు గదా! - కీర్త 139, 16.

మనం పుట్టకముందే మన రోజులిన్ని అని దేవుడు ముందుగానే నిర్ణయించాడు. తన పుస్తకంలో వ్రాసుకొన్నాడు కూడ. మనం ఎన్నాళ్ళ జీవిస్తామో, ఎలా జీవిస్తామో, ఏమేం చేస్తామో అతనికి బాగా తెలుసు. కాని ఈ తెలివిడివల్ల మన స్వాతంత్ర్యం నశించిపోదు. అనగా అతనికి ముందుగానే తెలుసు గనుక మనం ఈలా జీవించం. మనం ఈలా జీవిస్తాం గనుక అతనికి ముందుగానే తెలుసు. దేవుడు మన స్వాతంత్ర్యాన్నెప్పడూ అరికట్టడు. మన దుష్కార్యాలకు తానెపుడూ బాధ్యుడు కాడు. మంచిని చెడ్డనుచేసినా కర్తలము మనమే. ఫలితం అనుభవించేవాళ్ళమూ మనమే. ఈ సత్యం మనకు నిరాశనుగాదు, ఆశను పుట్టించాలి.

33. నేను ద్రాక్ష తీగను, మీరు నాలోనికి అతుకుకొన్న కొమ్మలు

-యోహా 15,4.

కొమ్మలు తల్లి తీగలోనికి అతుక్కొని వుంటాయి. తల్లి తీగలోని సారం వానిలోనికి ప్రసరిస్తుంది. ఆ సారాన్ని పొంది కొమ్మలు ఆకు దొడిగి, పూలు పూచి కాయలు కాస్తాయి. తల్లి తీగలోని సారం కాస్త ఆగిపోతే, కొమ్మలు వాడిపోతాయి, చస్తాయి. ఈ యుపమానమే మనకూ క్రీస్తుకూ కూడా వర్తిస్తుంది. అతని సారం మనలోనికి ప్రసరిస్తుంది. ఆ సారమే వరప్రసాదం. ఆ ప్రభువుతో ఐక్యమై యున్నంతకాలం అతని వరప్రసాదం మనలను దివ్యలనుగా చేస్తుంది. మనం పాపజీవితం విడనాడి పవిత్ర జీవితం గడుపుతాం. కాని ఆ ప్రభువునుండి వేరైపోయిననాడు మనలోని దివ్యజీవితం చచ్చిపోతుంది. ఇక మనకు మిగిలేది పాపజీవితం మాత్రమే.

34. నిన్నుగూర్చి నాకు తెలుసు - యిర్మీ 1,5.

ప్రభువు యిర్మీయా ప్రవక్తకు ప్రత్యక్షమై "నేను నిన్ను మాతృగర్భంలో నెలకొల్పకముందే నిన్నుగూర్చి నాకు తెలుసు. నీవు మాతృగర్భంనుండి వెలువడకముందే నిన్ను ప్రవక్తగా నియమించాను" అన్నాడు. కనుక యిర్మీయా పుట్టకముందే ప్రభువుకి అతన్నిగూర్చి బాగా తెలుసు. యిర్మీయా తల్లి కడుపునుండి బయటపడకముందే ప్రభువు అతన్ని తన ప్రవక్తగా నియమించాడు. ప్రభువు యిర్మీయాకు చెప్పిన వాక్యమే మనకూ చెప్తాడు. మనం పుట్టకముందే మనలను గూర్చి ఆ ప్రభువుకి తెలుసు. మనం ఏంపని చేస్తామో ఎలా జీవిస్తామో గూడా అతనికి బాగా తెలుసు. ఒక్కోమారు మన జీవితం ఏమౌతుందో అని దిగులుపడిపోతూంటాం, ఆత్మవిచారానికి గురౌతుంటాం. అలాంటప్పుడు పైవాక్యం మనలో నమ్మికను పట్టిస్తుంది. నారు పోసినవాడు నీరు పోయడా అనే విశ్వాసం కలిగిస్తుంది.