పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/291

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాటలే పై వాక్యం. అనగా క్రీస్తు సమకాలికులకు అతన్ని గూర్చి కలిగిన భావం ఇది. క్రీస్తుతానుచేసిన పనులన్నీ సంతృప్తికరంగా చేసాడు. అతని పనులను చూచి పరలోకంలోని, పిత మెచ్చుకొన్నాడు. భూలోకంలోని ప్రజలూ సంతుష్టులయ్యారు. మనం చనిపోయాక మన సమాధి రాతిమీదగూడ ఇతడు చక్కగా పనిచేసాడనో, ఇతడు చక్కగా ప్రవర్తించాడనో వ్రాసిపెడితే ఎంత బాగుంటుంది! కాని అప్పడు అలాంటి మెప్పకోలును పొందాలంటేఇప్పడు మనం ఎలా ప్రవర్తించాలి?

30. నేను నీకు తోడై యుంటాను - యొష 41.10.

యెషయా ప్రవచనంలో "బాధామయ సేవకుడు" అనే మహానుభావుడొకడు ప్రజలకొరకు ప్రాణాలు అర్పిస్తాడు. అతని మరణం ద్వారా ప్రజలకు జీవం కలుగుతుంది. ఈ ప్రవచనం నూత్న వేదంలో రాబోయే క్రీస్తుకు వర్తిస్తుంది. పై వాక్యంలో ప్రభువు ఈ బాధామయ సేవకుణ్ణి ఉద్దేశించి "నేను నీకు తోడై యుంటాను" అంటాడు. ప్రభువు తోడై యుండబట్టే అతడు ధర్మమూర్తియై ప్రాణత్యాగం చేయగలిగాడు. పూర్వవేద భగవంతుడు తన ప్రజలకు ಟ್: యుండేవాడు. కనుకనే అతనికి ఇమ్మానువేలు- మనతోవుండే దేవుడుఅని పేరు. ఆలాగే నూత్నవేద భగవంతుడూ తన ప్రజకు తోడైయుంటాడు. కనుకనే అతడు "లోకాంతం వరకూ నేను మీతో వుంటాను" అని హామీయిచ్చాడు. మత్త 28,20. ఆ ప్రభువు మనకు తోడై యుండబట్టే మనం ఒకపాటిగానైనా విశుద్దజీవితం జీవింప గల్లుతున్నాం. ఒకపాటిగానైనా సత్కార్యాలు చేయగలుగుతున్నాం. కనుక ఈ దేవుని తోడును అభిలషిద్దాం, అడుగుకొందాం.

31. దేవుడు తన్ను ప్రేమించేవాళ్ళకి అన్నీ సవ్యంగానే అమర్చుతూంటాడు

- రోమా 8,28.

ఇది చాలమంచి వాక్యం. దేవుడు తన్ను ప్రేమించేవాళ్ళను గమనించి వాళ్ళకు అన్నీ అనుకూలంగా వుండేలా చూస్తాడు. అంటే వాళ్ళకు కష్టాలూ చిక్కులూ రావనిగాదు, వస్తాయి. కాని అలా వచ్చిన కష్టాలను గూడ వాళ్లు సద్వినియోగం చేసుకొంటారు. వాటిని వ్యర్ధం చేసికోరు. వాటివలన ఫలితం పొందుతారు. జీవితంలో మనకు బోలెడన్ని సంఘటనలు తటస్థిస్తుంటాయి. వాటిల్లో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. ఐనా మనం మంచి సంఘటనల వలన ఫలితం పొందుతామేమో గాని, చెడ్డ సంఘటనల వలన మాత్రం తరచుగా ఫలితం పొందం. దేవుని ప్రేమించేవాళ్లు ఈ చెడ్డ సంఘటనల వలన కూడ ఫలితం పొందుతూనే వుంటారు. అది ఈ వాక్యం బోధించే సత్యం. దేవుణ్ణి ప్రేమించే నరుడు పొందే ఫలితం ఈలాంటిది.