పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/285

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



14. నీ యొద్ద జీవధార వుంది, నీ వెలుగులో మేమూ వెలుగు చూస్తాం

- కీర్త 36,9.

ప్రభువు జీవమిచ్చేవాడు. ఈ జీవానికే కీర్తనకారుడు వెలుగు, జీవధార అని రెండు ఉపమానాలు వాడాడు. అతనినుండి జీవజలం ఓ జీవధారనుండి లాగ నిరంతరాయంగా పెల్లుబికి వస్తుంది. ఈ జీవజలం వల్లనే మనం బ్రతుకుతున్నాం. పైగా అతడు తేజఃపుంజముకూడ. అతని వెలుగు సోకితేనేగాని మనకు వెలుగులేదు. అనగా అతని జీవం నుండి కాని మనం జీవం పొందలేము. లగ్రాంజ్ అనే బైబులు పండితుడు పూర్వవేదంలోకల్లా పై వచనం శ్రేష్ణవాక్యం అన్నాడు. పూర్వ వేదంలోకల్లా శ్రేష్టమైన వాక్యం ఐనా కాకున్నా శ్రేష్టమైన బ్తెబులు వాక్యాల్లో ఇదీ వొకటని మాత్రం చెప్పాలి. ఆ ప్రభువు మనకు కూడ తన వెలుగునూ జీవాన్నీ ప్రసాదించాలని మనవి చేద్దాం.

15. అతడు భాగ్యవంతుడైకూడ మీ కోసం నిరుపేద అయ్యాడు .

- 2కొ 8,9.

ఈ వాక్యం క్రీస్తు జననానికి వర్తిస్తుంది. అతడు దేవుడై కూడ మనకోసం నరుడై పుట్టాడు. ఎందుకు? నరులమైన మనలను దివ్యలను చేయడానికి. ఆ ప్రభువు తన దివ్యత్వాన్ని మనకిచ్చి దానికి బదులుగా మన మానుషత్వం తాను పొందుతాడు. మన మానుషత్వం వల్ల అతనికేమీ లాభంలేదు. అతని దివ్యత్వం వల్ల మనకు మాత్రం ఎంతైనా లాభం వుంటుంది. అతడు దరిద్రులను ధనాధ్యులను జేసేవాడు. పెంట ప్రోవులమీద కూర్చొనిన దౌర్భాగ్యులను పైకిలేపి సింహాసనాలమీద కూర్చుండబెట్టేవాడు-1 సమూ 28. దరిద్ర నరజాతికి చెందిన మనం అతనిద్వారా దివ్యలం కావాలి.

16. మనం పిడికెడు మట్టి మద్దనుండి పుట్టామని ఆ ప్రభువునకుజ్ఞాపకముంటుంది - కీర్త 103, 14

మన పుట్టుపూర్వోత్తరాలు ఆ ప్రభువునకు బాగా తెలుసు. నరులు పిడికెడు మట్టి ముద్దనుండి పుట్టిన ఆదాము సంతతివారని ఆ ప్రభువునకు జ్ఞాపకముండదా? కనుక మన బలహీనతలను జూచి మనం ఆశ్చర్యపడినా, ఆ ప్రభువు మాత్రం ఆశ్చర్యపడడు. తండ్రి బిడ్డలమీద జాలి జూపినట్లుగా ఆ ప్రభువు మనమీద జాలి జూపుతూంటాడు. మనం నడవలేక జారిపడిపోయినపుడు అతడు జాలితో పైకి లేపుతూంటాడు. బురదలో దిగబడిపోయినపుడు నెనరుతో ఒడ్డచేరుస్తూంటాడు. బైబులు భగవంతుడు నరులేమి అపరాధం చేస్తారో పట్టుకొందామని ఓ పోలీసువాడిలాగ కనిపెట్టుకొని వుండడు. ఓ తండ్రిలాగ మనలను నెనరుతో చూస్తూంటాడు. నిత్యమూ మనలను ఆదుకొంటాడు.