పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/280

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



13. మహావాక్యాలు

బైబులు భాష్యం - 16

1. నాయందు నిర్మల హృదయం సృజించు - కీర్త 51,10.

నరుని ఆలోచనలకీ కోరికలకీ మూలం అతని హృదయం. కనుక నిర్మల హృదయం కలవాడు పవిత్ర మానవుడు. దుష్ట హృదయం కలవాడు దుషుడు. అందుకే పై వాక్యంలో కీర్తనకారుడు చిత్తశుద్ధితో నిర్మల హృదయాన్ని కోరుకొన్నాడు. ఇది చాలా డొక్కశుద్ధిగల ప్రార్థన. మనమంతా పాపులమే, రోజురోజు పాపపు బురదలో అడుగు పెట్టేవాళ్ళమే. కనుక ఓమారు మన హృదయంలోనికి మనం తొంగిచూచుకొని "ప్రభో! నా హృదయాన్ని నిర్మలంచేయి" అని ప్రార్థించుకొందాం. ప్రవక్త యొహెజ్కేలు ప్రవచనంలో ప్రభువు నేను మీకు నూతన హృదయాన్ని నూతన ఆత్మనూ ప్రసాదిస్తాను. మీలోని రాతిగుండెను తొలగించి దాని స్థానే మాంసపు గుండెను నిలుపుతాను అంటాడు - 36,26. ఈవాక్యంలో రాతిగుండె అవిధేయుడైన మానవుణ్ణి, మాంసపు గుండె విధేయుడైన మానవుణ్ణి సూచిస్తాయి. ఈ నిర్మల హృదయమూ ఈ మాంసపగుండే నరుడు ఆశింపదగిన భాగ్యాలుకదా!

2. నేను వచ్చింది మీకు జీవాన్ని ఈయడానికీ, సమృద్ధిగా ఈయడానికీ

కూడా - యోహా 10,10

క్రీస్తు మనకు జీవం ప్రసాదిస్తాడు. ఆ జీవంకూడ సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. లోకంలోని వెలుగంతా గూడా సూర్యుని వద్దనుండి వస్తుంది. అలాగే ఆధ్యాత్మికమైన వెలుగంతా క్రీస్తు నొద్దనుండిగని రాదు. అతడు జీవనదాత. ఐనా మనం తరచుగా ఆ ప్రభువు దగ్గరికి వెళ్ళం. జీవంకోసం, మన అక్కర్లు తీర్చుకోవడంకోసం, వాళ్ళనూ వీళ్ళనూ ఆశ్రయిస్తూంటాం. తోడి నరులుగాని మరే సృష్టివస్తువులు గాని మనకు సమృద్ధియైన జీవం ఈయలేరు. కనుక ఆ క్రీస్తు నుద్దేశించి, ఆ ప్రభువు నెదుట మన పేరు నుచ్చరించి "ప్రభో! ఫలానా పేరుగల నాకు నీ జీవాన్ని సమృద్ధిగా ప్రసాదించు" అని ప్రార్థిద్దాం.

3. నీ యాలోచనలతో నన్ను నడిపిస్తావు

కడపట నన్ను నీ మహిమలోనికి జేర్చుకొంటావు - కీర్త 73, 24.

దేవుడు మనకు మొదట ఓ మంచిపని చేయాలనే కోరిక పుట్టిస్తాడు. ఆ పని చేసేపుడు తాను సహాయపడతాడు. అతని అనుగ్రహంవలననే మనం ఆ పనిచేసి ముగిస్తాం. 272