పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/279

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



18. కొత్త సృష్టి - పాత సృష్టి

ప్రభువులో నెలకొని వుండేవాడు నూత్నసృష్టికి చెందుతాడు. అలా నెలకొని వుండనివాడు పాతసృష్టికి చెందుతాడు. అతనిది పాతజీవితం-2 కొ 5, 17.

19. బానిసలు - దత్తపుత్రులు

కొందరు దేవునిపట్ల బానిసల్లా మెలుగుతారు. వీళ్లకు స్వాతంత్ర్యం వుండదు. కొందరు దేవుని పట్ల దత్తపుత్రుల్లా మెలుగుతారు. వీళ్ళకు స్వేచ్ఛ వుంటుంది. నూత్న వేద ప్రజలమైన మనం ఈలాంటి వాళ్ళం- రోమా 8,15-16. కాని దేవునిపట్ల చనువూ చొరవా లేకపోతే మనం కూడ బానిసలమై పోతాం.

20. దైవప్రియులు - ఇహలోక ప్రియులు

క్రీస్తుని ఎదిరించిన యూదులు ఇహలోక సంబంధులు. వీళ్ళు పాపులు. క్రీస్తూ అతని శిష్యులూ దైవసంబంధులు - యోహా 8,23. పాపులు ఇహలోక సంబంధమైన ఆత్మను స్వీకరిస్తారు. కాని శిష్యులు దేవుని ఆత్మను స్వీకరిస్తారు - 1కొ 2,12. పాపులు ఇహలోక అభిరుచులకూ ప్రమాణాలకూ అనుగుణంగా జీవిస్తారు. కాని భక్తులు ఇహలోకపు విలువలను స్వీకరించరు. వాళ్ళు ఎప్పటికప్పుడు దేవుని నుండి మానసికమైన మార్పునీ, నూత్నత్వాన్నీ పొందుతారు - రోమా 12,2. పాపులు కంటికగుపించే ఈలోక వస్తువులు మిూదనే శ్రద్ధ జూపుతారు. కాని పుణ్యపురుషులు అగోచరాలైన పరలోక వస్తువుల విూదనే శ్రద్ధ జూపుతారు -2 కొ4,18. ఈలోకమూ, దాని వ్యామోహాలూ గతిస్తాయి. కాని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు చిరంజీవి ఔతాడు- 1యోహా 2,17. పాపపు మానవులు ఈ లోకాన్నే ప్రేమిస్తారు. కాని దివ్యమానవులు తండ్రియైన దేవుణ్ణి ప్రేమిస్తారు. 1యో 2,15, లోకాన్ని ప్రేమించేవాళ్ళు ఇక్కడే సంపదలు కూడబెట్టుకొంటారు. వాటిని చిమ్మటలూ త్రుప్పూ దొంగలూ కాజేస్తారు. స్వర్గాన్ని ప్రేమించేవాళ్ళు మోక్షంలో సంపదలు కూడబెట్టుకొంటారు. అవి అక్షయంగా వుండిపోతాయి - మత్త 6,20. ప్రాకృతిక మానవులు ఈ భూమిపై గల వస్తువుల విూద మనసు లగ్నం జేసికొంటారు. కాని ఆధ్యాత్మిక మానవులు పరలోకంలోని వస్తువుల విూద మనసు నిల్పుకొంటారు. ఎందుకంటే ఉత్తాన క్రీస్తు అక్కడ దేవుని కుడిప్రక్కన ఆసీనుడై వుంటాడు గనుక - కోలో 3,2. ఇహలోక ప్రియలు దేవునికి విరోధులు. కనుక ఈ లోకాన్ని ప్రేమించేవాడు తప్పకుండా దేవునితో విరోధం తెచ్చి పెట్టుకొంటాడు - యాకో 4,4. పైన మనం పేర్కొన్న 19 అంశాలను గూడ ఈ చివరి అంశంలో ఇమడ్చవచ్చు నరులను ఇహలోక ప్రియలు దైవప్రియులు అని రెండు వర్గాలుగా విభజించవచ్చు. ఈ రెండు వర్గాలవాళ్ళు వేరువేరు యజమానులను సేవిస్తారు. దైవప్రియలు దేవుణ్ణి కోరుకొని అతన్ని సేవిస్తారు. ఇహలోక ప్రియలు ద్రవ్యాన్ని కోరుకొని దాన్ని సేవిస్తారు - మత్త 6,24. 271