పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/272

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



3. నరుడు నిత్యజీవానికి దాహం గొనాలి, 13-15.

నరుల హృదయాల్లో ఓ మహా దాహం కన్పిస్తుంది. ఆ దాహం మృత్యువుని జయించి అమరత్వం పొందడానికి, నిత్యజీవాన్ని సంపాదించుకోవడానికి, కనుకనే వైదిక ఋషి "మృత్యోర్మా అమృతం గమయ" - నేను ఈ మరణాన్ని తప్పించుకొని అమరత్వాన్ని పొందేలా చేయి - అని ప్రార్ధించాడు. భగవంతుని యందు విశ్రమించిందాకా మన హృదయాలకు విశ్రాంతి లేదు అని నుడివాడు అగస్టీను భక్తుడు. ఈ హృదయ దాహాన్ని తీర్చడానికే ప్రభువు జీవజలం దయచేస్తాడు. అది భక్తుని హృదయంలో నిత్యజీవానికి ఊరే నీటిబుగ్గ ఔతుంది. అనగా క్రీస్తుని విశ్వసించే భక్తుని హృదయంలో నిరంతరమూ పారే నీటి బుగ్గ ఒకటి పెల్లుబుకుతుంది. దాని నీళ్ళు అతనికి నిత్యజీవాన్ని దయచేస్తాయి. ప్రభువు సమరయ మహిళ హృదయంలో నిత్యజీవం పట్ల కోరిక పుట్టించాడు. ఆమె యింతకుముందు క్రీస్తు తనకు ఏవూట నీల్లో యిస్తాడనుకొంది. ఇప్పడు అతడేదో అద్భుతమైన నీళ్ళు దయచేస్తాడు అనుకొంది. కాని ఆ నీళ్లేమిటివో ఆమెకు సరిగా అర్థం కాలేదు. ఆ జలం దేవుని వరప్రసాదానికి చిహ్నంగా వుంటుందని ఆమె గుర్తించలేదు. ఆమె యింకా భౌతిక పరిధిలోనే వుండిపోయింది. ఆ జలం వల్ల తన భౌతికమైన దప్పిక తీరుతుందని భావించింది. కనుక తాను మళ్లామల్లా బావికి వచ్చే అవసరం తీరిపోయేలా తనకా నీళ్ళు ఈయమని అభ్యర్థించింది. సమరయ స్త్రీ జీవజలాన్ని భౌతిక జలంగా అపార్థం చేసికొన్నా ఆమె ఆ నీటిని మక్కువతో ఆశించింది. ప్రభువు ఈనాడు మనం కూడ ఆ జీవజలాన్ని ఆశించాలని కోరుకొంటాడు. ఆ జీవజలం పవిత్రాత్మేనని తర్వాత విశదమౌతుంది - యోహా 7,37-39.

4 ప్రభువు ఆమెను ఆత్మావలోకనానికి సిద్ధంజేసాడు, 16-17

సమరయ స్త్రీకి జీవజలం విూద కోర్కె పుట్టగానే ప్రభువు ఆమెతో నీ భర్తను పిల్చుక రమ్మన్నాడు. దేవుని అనుగ్రహాన్ని పొందాలంటే హృదయ పరివర్తనం అవసరం. పరివర్తనం చెందితేనే గాని దైవదర్శనమూ పరలోకప్రాప్తి లేదు - మత్త 18, 3. కనుక ప్రభువు ఆమె హృదయాన్ని పరివర్తనానికి సిద్ధం చేసాడు. ఆమె తనలోనికి తాను చూచుకోవడానికి సాయం చేసాడు. సమరయులూ యూదులూ మూడు సార్లు పెండ్డాడవచ్చు. కాని ఈమె ఐదవ పురుషునితో జీవిస్తుంది. అనగా వ్యభిచార జీవితం గడుపుతూంది. కనుక ఆమె పరివర్తనం చెందాలి. ఆమె హృదయం సృష్టివస్తువుల నుండి ఇహలోక సుఖభోగాల నుండీ ఆనందం పొందగోరుతూంది. నిజమైన ఆనందం దేవుని నుండిగాని లభించదని ఆమె యింకా గుర్తించలేదు. అలాగ గుర్తించేలా చేసాడు ప్రభువు. భర్త పేరు రాగానే ఆమె నాకు భర్త లేడు అని బొంకింది. ఈ బొంకు ఆత్మరక్షణానికి. "నీ భర్తని పిలువ" అన్న ప్రభువు వాక్కు ఓ న్యాయాధిపతిలా ఆమె నేరాన్ని రుజువు చేసింది. ఆమె మిూద వ్రేలెత్తి చూపింది. కాని తన తప్పని ఒప్పకొని, 264