పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/267

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ఇక్కడ కష్టాల్లో ప్రభువు తన్ను చేయి విడిచాడని యిర్మీయా మొరపెడుతున్నాడు. రాజులు అతన్ని హింసించారు. ప్రజలు అతన్ని తృణీకరించారు. తోడి ప్రవక్తలు అతన్ని గేలిచేసారు. ఇవి యిర్మీయా శ్రమలు. ఈ శ్రమల్లో దేవుడు యిర్మీయాను చేయి విడచినట్లుగా కన్పిస్తున్నాడు. కనుక దేవుడు వేసవిలో వట్టిపోవడంచే నమ్మదగనిదిగా వుండే నదిలాంటి వాడని ప్రవక్త నిందించాడు.

ఇక్కడ "నమ్మదగని నది" అనే వుపమానం భావం ఇది. ఓ నది వుంది. అది వానకాలం నిండి పారుతూండేది. ప్రయాణీకులు దాని దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రాగి దప్పిక తీర్చుకొనేవాళ్లు, కాని యిదేనది యెండ్లకాలం రాగానే యెండిపోయింది, ఈ సంగతి ప్రయాణికులకు తెలియదు. వాళ్లు ఎండ్లకాలం ప్రయాణం చేస్తూ మామూలుగా పోయినట్లే నీటి కోసం మళ్ళా దాని దగ్గరికి పోగా అది వట్టిపోయి వుంది. బాటసారులకు ఆశాభంగం కలిగింది. అది వాళ్ళను మోసగించింది. అలాగే ప్రభువు కూడా యిర్మీయాను ఒకప్పుడు ఆదరించాడు. తానతనికి పొంగిపారే నదిలాంటి వాడయ్యాడు. కాని యిప్పడు తాను కష్టాల్లో వుంటే దేవుడు తన కోపు తీసికోవడం లేదు. అతడు ఎండిపోయిన నదిలా తయారై తనకు ఆశాభంగం కలిగించాడు. తన నమ్మకాన్ని వమ్ముజేసాడు. కనుక ప్రవక్తకు తీరని మనస్తాపం కలిగింది. అతని పుండు మానని గాయంలా వుంది – 15,18, అతనికి ప్రభుదర్శనం లభించడం లేదు. చీకట్లో తిరుగాడుతున్నాడు. తాను ఇప్పడు ఏటివొడ్డున పెరిగే చెట్టులాలేడు. ఎడారిలో చౌటిపర్రలో ఎదిగే ముండ్లతుప్పలా వున్నాడు — 17,5-8. ఈ విధంగా యిర్మీయా ఇక్కడ తన భౌతిక బాధనీ ఆధ్యాత్మిక వేదననీ వొలకబోసికొన్నాడు.

3. దేవుడు కొన్నిసార్లు మనలను ఆదరిస్తాడు. అప్పడు మనకు ఆనందం కలుగుతుంది. సింహాసనం ఎక్కినట్లుగా వుంటుంది. కాని కొన్నిసార్లు అతడు మనలను చేయి విడుస్తాడు. అప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. గద్దెమిూది నుండి క్రింద పడిపోయినట్లుగా వుంటుంది. కాని బాధాకాలంలో భక్తుడు భగవంతుణ్ణి విడనాడకూడదు. తన కష్టాలను ఆ ప్రభువుముందు విన్నవించుకొంటూ అతన్నే నమ్మకొని వుండాలి. అతన్ని పరిత్యజిస్తే ఇక మనకు దిక్కెవరు? అతనితో హృదయం విప్పి మాట్లాడకపోతే మరెవరితో మాట్లాడతాం? కష్టసుఖాల్లోను మనలను భరించే తండ్రి అతడు కాడా? ఇక్కడ యిర్మీయా ప్రవర్తించిన తీరు కష్టకాలం వచ్చినపుడు మనం దేవునిపట్ల ఏలా మెలగాలో నేర్పుతుంది.

26. నీవు నన్ను చెరిచావు - యిర్మీ 20, 7

1. యిర్మీయా ప్రభువుని వేసవిలో వట్టిపోవడం వల్ల నమ్మదగనిదిగా వుండే నదితో పోల్చాడు - 15.18. ఇక్కడ పురుషుడు కన్యను మోసగించి చెరచినట్లుగా దేవుడు తన్ను నమ్మించి చెరచాడని చెప్తున్నాడు. తన అజ్ఞానాన్ని ఆసరాగా తీసికొని ప్రభువు తన్ను