పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/261

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు ఆ నగరాన్ని నాశం చేస్తే సజ్జనులు కూడ చనిపోతారు. లోకానికి న్యాయాధిపతియైన దేవుడు దుర్జనులతో పాటు సజ్జనులను కూడ నాశం చేయడం ఏమి ధర్మం? కనుక అబ్రాహాము సాదొమ పట్టణాన్ని మన్నించమని దేవునికి మనవి చేసాడు. ప్రభువు న్యాయాన్ని అతనికే గుర్తుచేసాడు.

ఆ నగరంలో 50 మంది నీతిమంతులుంటే దాన్ని కాపాడమని అబ్రాహము అడిగాడు. దేవుడు సరేనన్నాడు. కాని ఆ పట్టణంలో అంతమంది పుణ్యాత్ములు లేరు. అబ్రాహాము తన సంఖ్యను 45కి తగ్గించాడు. 45 మంది మంచివాళ్లున్నాదేవుడు నగరాన్ని కాపాడతానన్నాడు. ఆ విూదట అబ్రాహాము తన సంఖ్యను నలభైకీ, ముప్పయికీ, ఇరవైకీ, పదికీ తగ్గించుకొంటూ వచ్చాడు. అబ్రాహము ఆరుసార్లు మనవి చేసాడు. భక్తిమంతులుంటే నగరాన్ని తప్పక కాపాడతానని దేవుడు ఆరుసార్లు ప్రమాణం చేసాడు. కాని ఆ వూరిలో పదిమంది పుణ్యాత్ములుకూడ లేరు. కనుక దేవుడు సౌదొమ గొమొర్రాలను భస్మం చేసాడు.

ఐతే సాదొమ నగరంలో నల్లురు భక్తిమంతులున్నారు. వాళ్ల లోతు, అతని భార్య, ఇద్దరు కూతుళ్ళు ఆ నల్గురి కోసం ప్రభువు పట్టణాన్ని కాపాడలేదు. ఆ నల్గురిని కాపాడాడు. వాళ్లను నగరం నుండి బయటకు పంపిన పిదప దాన్ని తగలబెట్టాడు - 19.15. ఈ విధంగా అతడు తన న్యాయాన్ని నిలబెట్టుకొన్నాడు. దుర్మార్గులతో పాటు సన్మారులను నాశనం చేయలేదు. దుర్మారులను శిక్షించి సన్మారులను వదలివేసాడు - 58,25. అందువల్ల అబ్రాహాము విజ్ఞాపనం వ్యర్థమైపోలేదు. నల్గురు పుణ్యాత్ములను కాపాడ్డం అనే పద్ధతిలో అది ఫలించింది.

3. విజ్ఞాపనమంటే, ఇతరుల కొరకు ప్రార్ధనచేయడం. ఈ ప్రార్థన చేయదగింది. తరచుగా వాళ్లనూ వీళ్లనూ మన కొరకు ప్రార్థన చేయమని అడుగుతుంటాం. ఇతరులూ మన జపాలను అర్ధిస్తుంటారు. ఒకరికొరకొకరు ప్రార్ధన చేయడం అవసరం. జనులందరూ దేవుని బిడ్డలు కనుక ఒకరికొకరు అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళూ ఔతారు. కనుక అందరూ ఒకరికొరకొకరు ప్రార్థన చేస్తుండాలి.

సొదొమ గొమొర్రా ప్రజలు దుషులు. ఆ పట్టణాలే ఆ ప్రజలను నాశం చేయమని దేవునికి మొరపెట్టుకొన్నాయి. ఐనా అబ్రాహాము అలాంటి దుష్టనగరాల కొరకు కూడ మనవి చేసాడు. మన ప్రార్థన నుండి ఎవరినీ తొలగించకూడదు. మన శత్రువుల కొరకు కూడ జపం చేయాలి. దేవుడు మంచివాళ్లకూ చెడ్డవాళ్లకూ సమానంగా వాన కురిపించడం లేదా? - మత్త 5, 45.

నీతిమంతుని ప్రార్థన మహాబలమైంది అని చెప్తుంది యాకోబు జాబు - 5,16. అలాంటి ప్రార్థనను మనం తప్పకుండా తోడివారికొరకు వినియోగించాలి. మనజపం వల్ల ఎవరోవొకరు దేవుని కృపకు పాత్రులైతే అదే మహాభాగ్యం అనుకోవాలి. లోకంలో ఇన్ని రకాల సేవలున్నాయి. కాని ప్రార్థనాసేవకు మించిన సేవ లేదు.