పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/260

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాగానే అతన్ని పట్టించుకోడానికి యిష్టంలేక, త్రోవ రెండో ప్రక్కకు తొలగి దాటిపోయారు - 10,31-32. వాళ్ళిద్దరూ యెరూషలేం దేవాలయంలో దేవుణ్ణి అర్చించేవాళ్ళు. ధర్మశాస్తానికి, దేవళానికి అంకితులైనవాళ్ళు, దైవభక్తులు, ప్రార్ధనాపరులు. ఐనా వాళ్ళ ఆపదలో వున్న తోడినరుణ్ణి పట్టించుకోలేదు. దేవుణ్ణి కొల్చే భక్తులకు తోడినరులను పట్టించుకోడానికి సమయం లేదని వాళ్ళభావం. దేవుణ్ణి సేవించేవాళ్ళు తోడి నరులను సేవించ నక్కరలేదని వాళ్ళ తలపు. దేవుడు వేరు ప్రజలు వేరని వాళ్ళ వుద్దేశం.

ఐనా క్రీస్తు వీళ్ళ చర్యను మెచ్చుకోలేదు. బాటసారిని ఆదరించిన సమరయుని మెచ్చుకొన్నాడు. నీవు కూడా వెళ్ళి ఆ సమరయుని లాగే చేయి అని ధర్మశాస్త్ర బోధకునికి అతన్ని ఆదర్శంగాను చూపించాడు = 10,37.

యూదులు సీనాయి నిబంధనకు చెందినవాళ్లు, ధర్మ శాస్తాన్ని పొందినవాళ్లు, దేవుణ్ణి భక్తితో పూజించేవాళ్ళు ఐనా సోదరప్రేమ లేందే వాళ్ళెందుకూ కొరగారని ప్రభువు ఈ కథలో నొక్కిచెప్పాడు. నేడు క్రైస్తవులమైన మనకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. తోడివారిని పట్టించుకోందే మనం దైవభక్తులం కాలేం. ఇరుగుపొరుగువారికి సేవలు చేయందే ప్రార్థనాపరులం కాలేం. ఆ మంచి సమరయుని లాగ ఆపదలో వున్నవారిని ఆదుకోందే క్రైస్తవులే కాలేం. 3. ఈ కథలో మంచి సమరయునికి పేరు లేదు. అతడెవరో మనకు తెలియదు. ఐనా అతడు క్రీస్తునే సూచిస్తాడు. క్రీస్తు తనకు పోలికగా వుండడానికే ఈ పాత్రను సృజించాడు. మానవజాతి పాపం వలన గాయపడి కొనవూపిరితో పడివుంది. క్రీస్తు తన ప్రాణాలొడ్డి మానవజాతి ప్రాణాలు కాపాడాడు. విశ్వమానవాళి కోసం అసువులు ధారపోసాడు. కనుక అతడే మనకు మంచి సమరయుడు. ఇక, మనం కూడ అతని లాగే నిరంతరం మంచి సమరయులంగా మెలగాలి. అక్కరలో వున్నవాళ్ళను ఆదుకోవాలి. కులం, వర్గం, మతం అనేవి మనకు ఆటంకం కాకూడదు. ఈ ప్రపంచమంతా, మానవజాతి అంతా మన కుటుంబమేనని భావించాలి. ఇదే శిష్యలక్షణం.

3. విజ్ఞాపనం

20, అబ్రాహాము విజ్ఞాపనం = ఆది 19,22=38

1. సాదొమ గొమొర్రా నగరాల ప్రజలు పాపకార్యాల్లో ఆరితేరిపోయారు. కనుక ప్రభువు ఆ పట్టణాలను నాశం చేయాలనుకొన్నాడు. అతడు ఈ సంగతిని తన భక్తుడైన అబ్రాహాముకి తెలియజేసాడు. అబ్రాహాము జాలిగొని ఆ దుష్టనగరాల తరపున దేవునికి విజ్ఞాపనం చేసాడు.

2. అబ్రాహాము దేవుని యొదుట నిల్చున్నాడు – 18,22. అనగా దేవునికి ప్రార్ధన చేసాడని భావం. సాదొమ నగరంలో దుర్జనులూ వున్నారు, సజ్జనులూ వున్నారు.