పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/256

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తండ్రే తనకు ఒప్పజెప్పాడన్నమాట. ఈలాగే ప్రతి ముఖ్యకార్యానికి ముందు అతడు ప్రార్ధన చేసేవాడు. ఆ కార్యాన్ని గూర్చిన తండ్రి చిత్తాన్ని గుర్తించేవాడు. తర్వాతనే ఆ పనికి పూనుకొనేవాడు.

2. శిష్యుల్ని ఎన్నుకోవడం క్రీస్తుకి అతి ముఖ్యమైన కార్యం అని చెప్పాం. వీళ్లు ప్రభువుతో వుండి అతని నుండి తర్ఫీదు పొందుతారు. క్రీస్తు వాళ్లను ఇద్దరిద్దరినిగా, తన కంటె ముందుగా, ఆయా గ్రామాలకు వేదబోధ చేయడానికి పంపుతాడు. అపోస్తలులు క్రీస్తుకి ముఖ్యులైనవాళ్ళు, కనుకనే పిశాచం వీళ్లను అపహరింప జూస్తుంది. అది వారిలో యూదాను ఒక్కణ్ణి మాత్రం దొంగిలింప గలుగుతుంది. తతిమ్మా పదకొండు మంది క్రీస్తుకి విశ్వాస పాత్రులుగానే వుండిపోయారు. క్రీస్తు వుత్తానానంతరం వీళ్లు అతని వుద్యమాన్ని కొనిసాగించారు. క్రీస్తు ప్రారంభించిన దైవరాజ్యాన్ని వ్యాప్తిచేసారు. ఈలాంటి శిష్యులను ఎన్నుకోక ముందు క్రీస్తు తండ్రికి ప్రార్థన చేయడం ఉచితమే కదా?

3. మన కార్యాలు ఏలా ప్రారంభిస్తాం? మనం ఆయా పనులు ప్రారంభించక ముందు దేవుని చిత్తాన్ని తెలిసికోవడానికి జపం చేస్తామా? అవి మన పనులా లేక దేవుని పనులా? ఆ పనులద్వారా మనం పేరు దెచ్చుకోవడం ముఖ్యమా లేక దేవునికి కీర్తి కలిగించడం ముఖ్యమా? మన కార్యాలను దైవబలంతోనే, దైవాశీర్వాదంతోనే కొనసాగిస్తుంటామా? మన ప్రేషితకార్యాల్లో మన స్వార్ధమెంత? దైవసేవ యెంత?

16. గెత్పెమని ప్రార్ధనం = మత్త 26, 34-44.

1. క్రీస్తు తన జీవితం చివరి భాగానికి వచ్చాడు. ఆ చివరి గడియల్లో అతడు పిశాచాన్ని ఎదిరించి పోరాడాలి. సిలువమరణాన్ని అనుభవించాలి. చావడానికి ఏ ప్రాణీ యిష్టపడదు. క్రీస్తుకికూడ చనిపోవాలన్న కోరికలేదు. ఐనా తాను పిత చిత్తానికి లొంగి సిలువ మరణాన్ని అంగీకరించాలి. ఇక్కడ తన చిత్తానికీ పిత చిత్తానికీ మధ్య ఘర్షణం ఏర్పడింది. ఈ ఘర్షణం క్రీస్తు హృదయంలోనే జరిగింది. గౌత్సెమని ప్రార్థన ఈ ఘర్షణాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది.

2. క్రీస్తు దేనికొరకు జపించాడు? “తండ్రీ ఈ పాత్రను నానుండి తొలగించు. ఐనా నేనీ పాత్రను త్రాగాలని నీ చిత్తమైతే, దాన్ని త్రాగడానికి సిద్ధంగానే వున్నాను" ఇది క్రీస్తు ప్రార్ధనం. ఈ ప్రార్థననే అతడు ఈ సందర్భంలో మూడుసార్లు జపించాడు. ఇక్కడ “పాత్ర" అంటే సిలువ మరణం, పాత్రను త్రాగడమంటే సిలువమీద చనిపోవడం.

మరణంతో మన జీవితం అంతమౌతుంది. కనుక ఏ ప్రాణీ చావడానికి వొప్పకోదు. క్రీస్తుకికూడ సిలువమీద చనిపోవడం ఇష్టంలేదు. కాని అది తండ్రి చిత్తం, తండ్రి ఏర్పరచిన రక్షణ ప్రణాళిక, క్రీస్తు తండ్రి చిత్తాన్ని జవదాటడు. కనుక అతడు తండ్రి కోరికను అనుసరించి సిలువ మరణాన్నిఅంగీకరించాడు. ఆత్మార్పణం చేసికొన్నాడు. 248