పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/255

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. ఈ ప్రార్థనలో హిజ్కియా తన అవసరమేమిటో తెలియజేయలేదు. కాని ఇన్నాళ్ళు చిత్తశుద్ధితో దేవుణ్ణి సేవించానని చెప్పకొన్నాడు. అతని అంతరాత్మే దీనికి సాక్ష్యం. తాను ప్రభువుని నిజాయితీతో సేవిస్తే, ఇప్పడు ప్రభువు తన్ను మరణంనుండి కాపాడాలికదా? అది అతని బాధ్యత కదా?

ప్రభువు హిజ్కియాను చేయి విడువలేదు. అతని కన్నీళ్లను అనాదరం చేయలేదు. దేవుడు శీఘమే అతని వ్యాధిని తొలగించి అతనికి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు. అతని ఆయుస్సుని పదిహేనేళ్ళ పొడిగించాడు కూడ.

3. జీవితంలో ప్రమాదం ముంచుకొని వచ్చినప్పుడూ, ఇక ఆశలేదనిపించినపడూ గూడ మనం దేవునివైపు మళ్ళాలి. నమ్మకంతో అతని సహాయం అడుగుకోవాలి. ఇంకా, మన జీవితానికి మన ప్రార్థనకీ దగ్గరి సంబంధం వుంటుంది. మనం జీవించినట్లే ప్రార్థిస్తాం. ప్రార్ధించినట్లే జీవిస్తాం. హిజియా భక్తిగా జీవించాడు గనుకనే భక్తితో ప్రార్ధించ గలిగాడు. భక్తితో ప్రార్ధించాడు గనుకనే రోగం నుండి బయటపడ గలిగాడు. దుష్ట జీవితం గడిపినవాళ్ళు అతనిలా నమ్మకంతో జపించలేరు.

ఇక్కడ ఇంకో విషయం కూడ వుంది. ఈ ప్రార్థనలో హిజ్కియా అంతరాత్మ అతనితో నీవు మంచి జీవితమే గడిపావు కనుక నీ యాపదలో దేవుణ్ణి సహాయం చేయమని అడుగు, అతడు నీ మొర వింటాడు అని చెప్పింది. మన ప్రార్ధనలో మన అంతరాత్మ కూడ ఈలా సాక్ష్యం పలకగలిగి వుండాలి. మంచివాళ్ల అంతఃకరణం ఈలా సాక్ష్యం పలుకుతుంది. చెడ్డవాళ్ల అంతఃకరణం ఈలా సాక్ష్యం పలకదు.

మన ప్రార్థనలో మన అంతరంగం మనలను సమర్ధిస్తే దేవుడు మన మొర తప్పక వింటాడు. ఆ యంతరంగం అతని స్వరమే కదా! మన అంతరంగం మనలను సమర్ధించకపోతే దేవుడు మన మొర వినడు. అనగా మనది దొంగ ప్రార్థన అన్నమాట.

15. క్రీస్తు అపోస్తలులను ఎన్నుకోవడం - లూకా 6,12-13

1. యేసు ప్రార్ధన చేసికోవడానికి కొండకు వెళ్ళి రాత్రంతా జపంలో గడిపాడు. ఉదయాన శిష్యులను పిల్చి వారిలో పండ్రెండు మందిని ఎన్నుకొన్నాడు. వారికి అపోస్తలులు అని పేరుపెట్టాడు - లూకా 6, 12-13. ఇవి భక్తిమంతమైన వాక్యాలు. యేసు దైవచిత్తాన్ని గుర్తించకుండా ఏపనీ చేయడు. శిష్యులను ఎన్నుకోవడం చాల ముఖ్యమైన కార్యం. ఆలాంటి పనికి పూనుకోక ముందు అతడు కొండమీదికి వెళ్లి అక్కడ ఏకాంతంగా వుండిపోయాడు. రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఆ ప్రార్ధనలో తాను ఎవరిని శిష్యులనుగా ఎన్నుకోవడం తండ్రి చిత్తమో తెలిసికొన్నాడు. ఆ జ్ఞానంతోనే ఉదయం శిష్యులను పిల్చి వాళ్లల్లో పండ్రెండు మందిని అపోస్తలులనుగా ఎన్నుకొన్నాడు. ఆ పండ్రెండు మందిని