పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/254

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



13. సంహరీబు జాబు =2 రాజు 19, 14=19.

1. సనెర్రీబు అనే అస్పిరియా రాజు యెరూషలేం మీదికి దాడిచేసాడు. హిజ్కియా రాజును బెదిరిస్తూ జాబు వ్రాసి పంపాడు. నీ దేవుడు నా బారినుండి నిన్ను కాపాడలేడు. ఇంతవరకు అస్సిరియా రాజులు నానా రాజ్యాలను కూలద్రోసారు. ఆ రాజ్యాల దేవుళ్లు నా దాడినుండి ఆరాజ్యాల ప్రజలను కాపాడలేకపోయారు. ఇప్పడు నీ దేవుడు మాత్రం యెరూషలేం పట్టణాన్ని నా బారినుండి ఏలా కాపాడతాడు? కనుక ఈ నగరాన్ని నా వశంజేయి— ఇది ననైరీబు వ్రాసింది, ఆ జాబు రాజనీ యావే ప్రభువునీ గూడ అవమానిస్తూంది.

2. హిజియారాజు చాల భక్తికలవాడు. దేవుణ్ణి నమ్మినవాడు. అతడు శత్రువు జాబుని దేవాలయంలోనికి తీసుకొనిపోయి ప్రభువు ఎదుట పెట్టి ప్రార్థన చేసాడు. అస్సిరియా రాజులు చాల రాజ్యాలను నాశంచేసినమాట నిజమే. కాని ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దైవాలు కారు. వాళ్ళు నరులు మలచిన రాతిబొమ్మలు, కొయ్యబొమ్మలు. ఆ విగ్రహాలు ఆ రాజ్యాలను కాపాడలేవు కదా! కాని యావే ప్రభువు సజీవుడైన దేవుడు. యెరూషలేమును కాపాడగల సమర్థుడు. అలాంటి దేవుడు సనైరీబునుండి తన్ను రక్షించాలిఇది హిజ్కియా ప్రార్థన.

ఈ జపంలో హిజ్కియాకు దేవునిపట్ల వున్న నమ్మకం వ్యక్తమౌతుంది. అస్సిరియా రాజులాంటి మహాబలవంతుడు తనమీదికి ఎత్తివచ్చినపుడు గూడ అతడు ప్రభువునే నమ్మాడు. దేవుని మీదనే భారం వేసాడు. విశ్వాసమంటే యిదికదా! అతని నమ్మకం వ్యర్థంగాలేదు. ఆరాత్రే ప్రభువదూత అస్పిరియా సైనికులను చాలమందిని చంపివేసాడు. అదిచూచి సనెర్రీబు భయపడి ముట్టడిని ఆపివేసి స్వీయదేశానికి తిరిగిపోయాడు.

3. జీవితంలో ఒకోసారి మనకు పెద్ద ఆపదలే ఎదురౌతాయి. మన విశ్వాసం చలిస్తుంది. భయం కలుగుతుంది. దేవుణ్ణి నమ్మబుద్ధి పట్టదు. కాని భక్తి కలవాళ్ళు ఈలాంటి ఘటోరవిపత్తుల్లో కూడ ప్రభువుని ఆశ్రయిస్తారు. అన్నిటినీ విడనాడి అతని సహాయం మీదనే ఆధారపడతారు. ప్రభువు ఆ భక్తుల గోడు వింటాడు. పై సంఘటనంలో జరిగింది ఇదే. నీతిమంతులు విశ్వాసంతో జీవిస్తారు — హబక్మూకు 2.4.

14. హిజ్కియా వ్యాధి = 2 రాజు 20, 1-6

1. హిజ్కియా జబ్బుపడ్డాడు. యెషయా ప్రవక్త అతన్ని చూడ్డానికి వచ్చి నీ యింటిని చక్కబెట్టుకో. ఇక నీవు బ్రతకవు అని హెచ్చరించాడు. హిజియాకు ఎంతో దుఃఖం కలిగింది. ఇక నరమాత్రులెవరూ తన ప్రాణాలు కాపాడలేరు. కనుక అతడు జనులనుండి తన ముఖాన్ని ప్రక్కకు త్రిప్పకొని గోడవైపు మళ్లాడు. ఆశతో దేవునివైపు చూచాడు. బోరున ఏడ్చాడు. ప్రభూ! ఇన్నాళ్ళు చిత్తశుద్ధితో నిన్నే సేవించాను. నీ చిత్తప్రకారమే జీవించాను అని ప్రార్థించాడు.