పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/253

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏది మంచిదో ఏది మంచిదికాదో, అసలు దైవచిత్తమేమిటో ఎవరికి తెలుసు? దేవుడు మనకోరికలను నిరాకరిస్తాడు. మనం ఉసూరుమంటాం. ఐనా మనం దేవుని చిత్తానికి లొంగవలసిందే. దేవునిమీద గొణగకుండా అతని నిర్ణయానికి కట్టుపడి వుండవలసిందే. అతనిపట్ల భక్తి విశ్వాసాలు నిలుపకోవలసిందే. దేవునిమీద అలిగి ప్రార్థనను ఆపివేయకుండా పూర్వంలాగ జపిస్తూ పోవలసిందే. మనజీవితంలోని సంఘటనలన్నిటిలోను తుది నిర్ణయం భగవంతునిదే. దైవనిర్ణయానికి తలొగ్గేవాడే నిజమైన భక్తుడు.

12. షిమీ దావీదుని శపించడం - 2 సమూ 16,5-13.

1. అబ్శాలొము దావీదుమీద తిరగబడ్డాడు. అతనికి దడిసి దావీదు యెరూషలేము నగరాన్ని విడిచి పారిపోయాడు. ఈ పలాయనం అతని జీవితంలోకల్లా దైన్యమైన సంఘటనం. ఈ పలాయనంలో సౌలు బంధువైన షిమీ దావీదుని అవమానించాడు. ఐనా రాజు అతనిమీద ప్రతీకారం తీర్చుకోలేదు. ఆ యవమానంలోగూడ దేవుని హస్తాన్ని గుర్తించి వినయంగా వుండిపోయాడు.

2. దావీదు సౌలునీ అతని కుమారులనూ అన్యాయంగా అణగద్రోక్కి వారి రాజ్యాన్ని అపహరించాడనే వదంతి వుంది. కనుకనే యిక్కడ సౌలు బంధువైన షిమీ నగరంనుండి పారిపోయే దావీదుని శపించి అతనిమీద రాళ్లు రువ్వాడు. దుమ్మెత్తి పోసాడు. నీవు రక్తపాతానికి ఒడిగట్టావు. ఇపుడు నీ యపరాధమే నిన్ను నాశంజేసింది. యావే నీమీద పగతీర్చుకొన్నాడు. నీవు శీఘమే ఇక్కడినుండి వెళ్లిపో, వెళ్లిపో అని దావీదుని చెడబడా తిట్టాడు. ఆ తిట్టలను సహించలేక దావీదు సైన్యాధిపతుల్లో ఒకడైన అబీషయి షిమీ తల ఎగరగొడతానన్నాడు. కాని దావీదు అందుకు సమ్మతించలేదు. ప్రభువే నన్ను శపించమని ఇతన్ని పరికొల్పాడేమో! వద్దనడానికి మనమెవ్వరం? యావే నా దైన్యాన్ని గుర్తించి ఇతని శాపాలకు మారుగా నాకు దీవెనలే యిస్తాడేమో అని పల్మాడు. యింతటి అవమానంలోగూడ దావీదు దేవుని హస్తాన్ని చూడగలిగాడు. అది దేవునివల్లనే సంభవించిందనుకొని తనకు కలిగిన పరాభవాన్ని సహించి ఊరకున్నాడు. ఈలా మానావమానాల్లోను భగవత్సాన్నిద్యాన్ని గుర్తించేవాడు దొడ్డ భక్తుడు కదా! ఇక్కడి సంఘటనంలో ప్రత్యేక ప్రార్ధన యేమీలేదు. దావీదు అవమానాల్లో కూడ దేవుని హస్తాన్ని గుర్తించడమే ప్రార్థన.

3. ఈ జీవితంలో మనకు ఆదరణమూ అనాదరణమూ, కీర్తీ అపకీర్తీ రెండూ ప్రాప్తిస్తాయి. అల్పులు కీర్తిని గ్రహించి అపకీర్తిని వదిలించుకోజూస్తారు. కాని భక్తులు అపకీర్తిలో గూడ దేవుని హస్తాన్ని గుర్తిస్తారు. కనుక కీర్తినిలాగే అపకీర్తినిగూడ గ్రహిస్తారు. అపకీర్తి అవమానాల ద్వారాగూడ దేవుడు మనలను అధిక పుణ్యవంతులను జేస్తాడు. నిందల ద్వారాగూడ మనకు తన వరప్రసాదాన్ని మెండుగా దయచేస్తాడు. క్రీస్తు సిలువమార్గం అవమానాలతో కూడింది కాదా? అతని శిష్యులమైన మనకు మాత్రం ఆ మార్గం తప్పతుందా?