పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/252

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వొప్పుకొన్నాడు. దేవుని ముందట నిల్చి నేను దోషినని అంగీకరించాడు. మంచి ప్రార్ధన ఎప్పుడు కూడ నిజాయితీతో కూడివుంటుంది.

3. మన తరపున మనం ఏవేవో తప్పులు చేస్తాం. తర్వాత దేవుని వాక్యం చదువుకొంటూంటే ఆ వాక్యం మనలను చీవాట్లు పెడుతుంది. మన తప్పను ఎత్తి చూపుతుంది, మన అంతరాత్మను మేలుకొల్పి మనలను చీవాట్లు పెడుతుంది. ప్రభువు పలుకు రెండంచుల కత్తిలాగ మన గుండెల్లోకి చొచ్చుకొనిపోయి మన తప్పలను పరిశీలించి చూస్తుంది. ఓ న్యాయాధిపతిలాగ మనం దోషులమని తీర్పు చెప్తుంది. అప్పుడు మనం నిజాయితీతో మన తప్పను అంగీకరించాలి - హెబ్రే 4, 12.

దావీదులాగ మనంకూడ పశ్చాత్తాపపడితే ఆ పశ్చాత్తాపం మన దోషాన్ని కడిగివేస్తుంది. మనలను ఉత్తమ మానవులను చేస్తుంది. భక్తిపరులను గావిస్తుంది. దావీదు "ప్రభువుకి నచ్చిన హృదయం కలవాడు” - 1సమూ 18, 14. పశ్చాత్తాప జపంద్వారా మనంకూడ దావీదులాంటివాళ్లమౌతాం. దావీదు పశ్చాత్తాపాన్నితెలియజేసే ఈ సంఘటనం మనకుకూడ జీవితంలో చాలసార్లు అనుభవానికి వస్తుంది.

11. దావీదు దైవచిత్తానికి లొంగడం -2సమూ 12, 15-23

1. ఊరియాను చంపించి బత్తెబాను అపహరించిన పిమ్మట దేవుడు దావీదుకి చావు తప్పించాడు. కాని రాజు శిక్షను పూర్తిగా తప్పించుకోలేదు. రాజుకు బదులుగా బత్తెబాకు పుట్టిన కుమారుడు చనిపోవలసి వచ్చింది. ఈ బిడ్డడి తరపున దావీదు దేవునికి మనవి చేసాడు. దైవశిక్షగా శిశువు చనిపోయాడు. ఆ పాపడు చనిపోయినపుడు దావీదు దేవుని మీద సుమ్మర్లు పడలేదు. దైవచిత్తానికి లొంగాడు.

2. బత్తెబా అన్నా ఆమెకు పుట్టిన బిడ్డడన్నా దావీదుకి ఎంతో ప్రీతి. కనుకనే అతడు పస్తుండి, కటిక నేలపై పరుండి, ఆ శిశువు కొరకు జపించాడు. వట్టి నేలపై పరుండడం తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసికోవడానికీ, దేవుని అనుగ్రహం సంపాదించడానికీ, కాని దావీదు ఎంత వేడినా ప్రభువు కరుణించలేదు. పాపడు చనిపోవలసి వచ్చింది.

బిడ్డ ప్రాణాలను తీసినందుకు దావీదు దేవునిమీద సుమ్మర్లు పడలేదు. దైవచిత్తానికి తలొగ్గాడు. శిశువు పోయాడని వినగానే కోవెలకు పోయి దేవునికి వందనాలర్పించాడు. తాను దైవచిత్తానికి బదుణ్ణని తెలియజేసికొన్నాడు. ఇంటికి వచ్చి నిర్విచారంగా భోజనం చేసాడు. ఆ పసికందును మృతలోకంనుండి వెనక్కుతీసికొని రాలేనని రాజుకి తెలుసు. ఓనాడు తాను ఆ బిడ్డదగ్గరికి వెళ్లాలిసిందేగాని అతడు మల్లా తన దగ్గరికి రాడని రాజు గ్రహించాడు. కనుక దావీదు దైవచిత్తానికి జోహారులర్పించి ఊరకున్నాడు. అతని విశ్వాసం ఎంతమాత్రం చలించలేదు.

3. ఈ జీవితంలో మనం ఏవేవో వస్తువులు కోరుకొంటాం. వాటికొరకు మక్కువతో దేవుని ప్రార్ధిస్తాం. దేవుడు మన కోర్మెలు తీరుస్తాడని ఆశిస్తాం. కాని మనకు