పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/250

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఇక్కడ అన్నా దేవునిమందు తన కష్టసుఖాలు చెప్పకొంది. మనసువిప్పి ప్రార్థన చేసింది. ఆమె మాటలతో జపించలేదు. హృదయంతో జపించింది. మన ప్రార్ధనలో తరచుగా మాటలుంటాయిగాని హృదయముండదు. ఈ ప్రజలు నన్ను పెదవులతో గౌరవిస్తున్నారుగాని వీళ్ళ హృదయాలు నాకు దూరంగా వున్నాయి అంటుంది యెషయా ప్రవచనం = 29, 13. కనుక ప్రార్ధనలో మాటలుకాదు, హృదయం ముఖ్యం. అన్నాది చిత్తశుద్ధికల ప్రార్థన.

9. దావీదు కృతజ్ఞత - 2 సమూ 7.28-29

1. దావీదురాజు దైవమందసాన్ని యెరూషలేమకి తీసుకొనివచ్చాడు. కాని తాను దేవదారు ప్రాసాదంలో వసిస్తూంటే దైవమందసం వట్టి డేరాలో పడివుంది. కనుక ఆ రాజు దైవమందసాన్ని వుంచడానికి దేవాలయాన్ని కట్టాలని సంకల్పించుకొన్నాడు. నాతాను ప్రవక్త తొలుత దావీదు సంకల్పాన్ని అంగీకరించాడు. కాని తర్వాత దైవ ప్రబోధితుడుడై రాజును దేవాలయం కట్టవద్దని శాసించాడు. అతని కుమారుడు సాలోమోను దేవళాన్ని కడతాడని చెప్పాడు. కాని భక్తిభావంతో తనకు దేవళాన్ని కట్టగోరినందున దేవుడు దావీదుని మెచ్చుకొన్నాడు. తానే దావీదుకు ఓ మందిరం కట్టిపెడతానని వాగ్హానం చేసాడు –7,11. ఈ మందిరమే దావీదు రాజవంశం. అవిచ్ఛిన్నమైన ఈ వంశంనుండే మెస్సీయా జన్మిస్తాడు. ఈలా దేవుడు తన్నుకరుణించినందుకు దావీదు అతనికి కృతజ్ఞతా స్తుతులు అర్పించాడు.

2. దావీదు డేరాలో మందసంముందు కూర్చుండి ప్రభువుకి వందనాలు చెప్పాడు. అతని ప్రార్థనలో రెండంశాలున్నాయి. మొదటిది, దేవుడు యిస్రాయేలును కరుణించాడు. వారిని ఐగుప్తనుండి తోడ్కొనివచ్చి తన ప్రజలనుగా జేసికొన్నాడు. వారికి వాగ్లత్త భూమిని దయచేసాడు. లోకంలోని ప్రజలందరిలోను వారిని గొప్పవారిని చేసాడు. ఇందుకు దావీదు దేవునికి వందనాలు చెప్పాడు - 7,23-24.

రెండవది, దేవుడు అనామకుడైన దావీదును తన భక్తునిగా ఎన్నుకొన్నాడు. ఇది దావీదుకు ఆశ్చర్యం కలిగించింది. ప్రభూ! నీవు నన్నింతగా పెద్దజేయడానికి నేనేపాటీ వాడ్డి? నా కుటుంబం ఏపాటిది? అని దావీదు దేవునికి విన్నవించుకొన్నాడు - 7,18. ఔను, పొలంలో గొర్రెలు కాచుకొనే దావీదును కొనివచ్చి ప్రభువు అతన్ని తన ప్రజలకు నాయకుణ్ణి చేసాడు. ఈ కారుణ్యాన్ని ఆ రాజు మర్చిపోలేదు. కనుక హృదయపూర్వకంగా దేవునికి వందనాలు అర్పించుకొన్నాడు. నీవు ఈ సేవకుని కరుణించావు. ఇక నేను విన్నవించుకోదగ్గది ఏమంది అని వినయంతో పల్కాడు –7,20.

3. అన్నా ప్రార్థనలో మన కష్టాల్లో దేవునికి ఏలా మొరపెట్టాలో చూచాం. ఈ దావీదు ప్రార్ధనలో మన సుఖాల్లో దేవునికి ఏలా వందనాలర్పించాలో నేర్చుకొంటాం. ఆ దావీదులాగే మనంకూడ అల్పులం, ఐనా ప్రభువు మనలను నానా వరాలతోను, విజయాలతోను బహూకరించాడు. మనకేదో ప్రత్యేక భాగ్యాన్ని కూడ దయచేసాడు. కనుక 242