పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/224

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెళ్ళడానికి అంగీకరించారు. తర్వాత ఆ తరం యిస్రాయేలీయులంతా యెడారిలోనే గతించారు. ఈ యిద్దరు మాత్రం వాద్దత్తభూమిలో ప్రవేశించారు - సంఖ్యా 14,30. మోషే కాలంచేయకముందు యెహోషువ మీద చేతులు చాచి ప్రార్థన చేసాడు. అతని యాత్మ యెహోషువ మీదికి దిగివచ్చింది. దానితో అతనికి బదులుగ ఇతడు యిస్రాయేలీయులకు నాయకుడయ్యాడు. ప్రభువే అతన్ని రెండవ నాయకుణ్ణిగా నియమించాడు - సంఖ్యా 27, 22. యొహోషువా దైవబలంతో కనానీయులతో యుద్ధం చేసాడు. మోషేకు తోడై యున్న దేవుడు యెహోషువాకు గూడ బాసటగా నిల్చాడు. మోషేకులాగే నీకూ నేను తోడైయుంటానని చెప్పాడు — యెహో1,5. ఈ దైవ బలంతోనే అతడు కనానీయులను గెల్చాడు. వారి దేశాన్ని స్వాధీనం చేసికొని దాన్ని పదకొండు తెగల యిస్రాయేలీయులకు పంచియిచ్చాడు.

అతడు చాలా యుద్దాలు చేసాడు. ప్రాకారాలతో గూడిన యెరికో పట్టణాన్ని జయించాడు. ఐనా అమెరీయులతో గిబ్యోనువద్ద చేసిన యుద్ధం అతనికి గొప్ప పేరు తెచ్చి పెట్టింది. ఇక్కడే యెహోషువ శత్రువులమీద పోరాడి వారిని నాశం జేసేంతవరకు సూర్యచంద్రులు అస్తమించకుండ ఆకాశంలో నిల్చిపోయారు. ప్రభువు యొహోషువ పక్షాన యుద్ధంజేసి అతనికి విజయాన్ని ప్రసాదించాడు - 10,12-14. యెహోషువ జీవితాంతం భక్తితో జీవించాడు. చనిపోక ముందు యావే ఆజ్ఞలకు బదులై యుండండని యిస్రాయేలీయులను హెచ్చరించాడు. మీరు ప్రభువుని పూజింపకపోయినా నేను నా కుటుంబం మాత్రం ఎల్లవేళలా అతన్నే సేవిస్తామని నొక్కి చెప్పాడు - 24, 15. యిస్రాయేలీయుల తరపున ప్రభువుతో నిబంధనాన్ని నూతీకరించాడు - 24,25. కడన ఆ దైవసేవకుడు నూట పదియేండ్ల యిూడున కన్నుమూసాడు –24–29.

2. క్రీస్తుకి సూచన వ్యక్తి

యెహోషువ అంటే యావే రక్షణం అని అర్థం. తన పేరుకి తగినట్లుగానే ఈ భక్తుడు మోషే తర్వాత చాలయేండ్ల పాటు యిస్రాయేలీయులను రక్షించాడు. పూర్వవేద కాలం చివరలో వచ్చిన సీరా తన గ్రంథం 46,1 లో ఇతన్ని ఈలా స్తుతించాడు.