పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/221

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుఖభోగాల్లో వాళ్ళు మునిగి తేలుతున్నారు. విశ్వాసవంతుడైన నోవా మాత్రం దేవుని నిర్ణయానికి భయపడ్డాడు. దేవుని వాక్కుకి విధేయుడై పడవను కట్టాడు. తర్వాత జలప్రళయంలో అందరూ చావగా తాను మాత్రం బ్రతికి బయటపడ్డాడు. నోవా విశ్వాసమూ విధేయతా అతన్ని కాపాడాయి. నేడు విశ్వాసరంగంలో అతడు మనకు ఆదర్శంగా వుంటాడు- హెబ్రే 11,7.

3. నోవా సద్భక్తుడు మాత్రమే కాదు, ధర్మప్రబోధకుడు కూడ. అనగా అతడు ఆనాటి జనులను జలప్రళయాన్ని గూర్చి ముందుగానే హెచ్చరించాడు. అతని మాటలను లెక్కచేయనివాళ్ళు చచ్చారు. లోకం విన్నా వినకపోయినా మన తరపున మనం దేవుణ్ణి గూర్చి చెప్పవలసిందే. వినేవాళ్ళు బాగుపడతారు. విననివాళ్ళ దైవశిక్షను కొనితెచ్చుకొంటారు - 2 పేత్రు 2,5.

4. దేవుని శిక్ష దుష్టులను నాశం చేస్తుంది. భక్తులను కాపాడుతుంది. జలప్రళయంలో చాలమంది చచ్చారు. పుణ్యపురుషుడైన నోవా మాత్రం ఓడద్వారా బ్రతికాడు. అదే నీళ్ళు కొందరికి శిక్షగా మారితే నోవాకు మాత్రం రక్షగా మారాయి. అతని రక్షణం మన జ్ఞానస్నానాన్ని తలపిస్తుంది. జ్ఞానస్నాన జలం నేడు మనలను చావు నుండి కాపాడుతుంది - 1 పేత్రు 3, 20-21.


4. మెల్కీ సెదెకు

మెల్కీసెదెకు అబ్రాహాముకి ఇష్ణుడు. క్రీస్తుని సూచించేవాడు. ఇక్కడ ఈ రెండు భావాలను క్రమంగా పరిశీలిద్దాం.

1. అబ్రాహాముకి ఇపుడు

మెల్మీసెదెకు షాలేము పట్టణానికి రాజు, యాజకుడు. ఈ షాలేమే తర్వాత యెరూషలేము ఐంది. ఈ రాజు అబ్రాహాముకి స్నేహితుడు. అబ్రాహాము ఓసారి నల్గురు రాజులను యుద్ధంలో ఓడించి వస్తూండగా మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షసారాయాలను తీసికొనివచ్చి అతనికి కానుకలుగా అర్పించాడు. అతన్ని దీవించాడు - ఆది 14,18. ఇక్కడ భోజనపదార్ధాలైన ఈ రొట్టెరసాల ద్వారా మెల్కీసెదెకు అబ్రాహాముతో నిబంధనం చేసికొన్నాడు. అబ్రహాము సంరక్షణ భారాన్నిగూడ స్వీకరించాడు. అబ్రాహాము తన తరపున తాను ఆ రాజుకి కప్పంకట్టాడు - 14, 20.