పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/219

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెప్పాడు - ఆది 1,28. అతడు మళ్ళా నోవాకుకూడ ఇవే మాటలు చెప్పాడు 9,7. అనగా ఆదామునుండి మొదటి నరజాతి వ్యాప్తిజెందినట్లే, నోవానుండి నూత్న నరజాతి వ్యాప్తి చెందుతుందని భావం. అటుపిమ్మట చాలయేండ్ల తర్వాత క్రీస్తునుండి నూత్న నరజాతి ఆవిర్భవిస్తుంది. కనుక నోవా రాబోయే క్రీస్తుకి సూచనంగా వుంటాడు. వీళ్ళిద్దరూ నూత్న నరజాతికి కర్తలే.

నోవా అనే పేరుకి ఓదార్చేవాడు అని అర్థం - 5,29. నోవా ఓదార్పు ఏమిటి? ప్రభువు జలప్రళయంవల్ల నాశమైన లోకాన్ని చూచి మళ్ళా నీటిముంపు ద్వారా ప్రాణి కోటిని నాశంచేయను అని నోవాకు వాగ్దానంచేసాడు. అతనితో నిబంధనం చేసికొన్నాడు-9,11-12. కనుక జలప్రళయం మళ్ళా లోకాన్ని నాశం చేయదు అనేదే నోవా మనకిచ్చే ఓదార్పు. ప్రభువు నోవాతో చేసికొన్న నిబంధనం అతని వంశజులందరికీ వర్తిస్తుంది. అతని ద్వారా ప్రాణికోటి కంతటికీ వర్తిస్తుంది. అనగా దేవుడు అతనిద్వారా సృష్టిని తనతో రాజీపర్చుకొన్నాడు.

జలప్రళయం కథ నోవాను నీతిమంతుడైన నాయకుణ్ణిగా చిత్రిస్తుంది. కాని ఆదికాండ 9,20-27 నోవాను గూర్చి మరో కథ చెప్తుంది. ఈ కథ నోవాను దురభ్యాసానికి లొంగిపోయిన బలహీనుణ్ణిగా చిత్రిస్తుంది. ఇది మరో బైబులు సంప్రదాయం. ఈ కథ ప్రకారం మొట్టమొదట ద్రాక్ష తోటలను పెంచినవాడు నోవాయే. అనగా అతడు ఆనాటి వ్యవసాయంలో గొప్ప మార్పు తీసికొని వచ్చాడు అనుకోవాలి — 9,20. ఓమారు అతడు ద్రాక్షరసం తప్పత్రాగి కైపెక్కి గుడారంలో దిగంబరుడుగా పడిపోయాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారిలో హాము తండ్రి అలా పడివుండడం చూచి తన యిద్దరు సోదరులకు చెప్పాడు. ఆ యిద్దరు సోదరులు దిగంబరుడైన తండ్రికి బట్టలు కప్పారు. తర్వాత నోవా హాముని శపించాడు. ఇక్కడ ద్రాక్షసారాయం నింద్యమైనదనీ, నరులు దాన్ని మితిమీరి త్రాగి వివేకం కోల్పోరాదనీ బైబులు రచయిత ఉద్దేశం.

2. నోవా ఆదర్శ భక్తుడు

పూర్వవేద ప్రవక్తలు, జ్ఞానులు నోవాను ఆదర్శభక్తునిగా కీర్తించారు. ప్రభువు ఆదర్శవంతుడైన నోవాతో నిబంధనం చేసికొన్నట్లే ఇతర భక్తులతోను నిబంధనం చేసికొంటాడు. అతడు నోవాకు కరుణ జూపినట్లే ఇతరులకు దయజూపుతాడు — యొష 54,9.