పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/217

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జకర్యాహత్య వరకు మీరు చిందించిన భక్తిమంతుల రకాపరాధం మీమీదికి దిగివస్తుంది సుమా అని క్రీస్తు యూదులను ముందుగానే హెచ్చరించాడు - మత్త 23,35. కడన అతడు చెప్పినట్లే జరిగింది. దుర్మార్గులు ఆ క్రీస్తునిలాగే శతాబ్దాల పొడవునా లోకం నలుమూలలా చాలమంది నిరపరాధులను హత్యచేస్తూవచ్చారు. ఈ నిరపరాధుల రక్తం న్యాయం చెప్పమని అన్ని కాలాల్లోను దేవునికి మొరపెడుతూనేవుంది.

హేబెలు రక్తమూ ఇతర నిరపరాధుల రక్తమూ న్యాయం చెప్పమని దేవునికి మొరపెట్టాయి. దోషులను శిక్షించమని అడిగాయి. కాని క్రీస్తురక్తం కేవలం దీనికి భిన్నంగా ప్రవర్తించింది. అది దోషులను మన్నించమని దేవునికి మనవి చేసింది. హేబెలు రక్తం దోషిని శిక్షించమని దేవుణ్ణి అడిగితే క్రీస్తు రక్తం దోషిని రక్షించమని అడిగింది. - హెబ్రే 12,24. తండ్రీ! వీరేమి చేస్తున్నారో వీరికే తెలియదు. కనుక నీవు వీరిని క్షమించు అని క్రీస్తు ప్రార్ధనం - లూకా 23,34. ఈ విధంగా నీతిమంతుడైన హేబెలు మరణంలో తటస్థించిన పరిస్థితి నీతిమంతుడైన క్రీస్తు మరణంలో తారుమారయింది. అక్కడ శిక్షనుకోరిన నెత్తురు ఇక్కడ క్షమాపణను కోరింది.

ఐనా హేబెలు నాటికీ నేటికీ నీతిమంతుడుగానే వుండిపోయాడు. నిర్మల హృదయానికి అతడు ప్రతీక. దేవుని నమ్మి భక్తితో జీవించే వాళ్ళకు అతడు ఆదర్శంగా వుంటాడు.

ప్రార్థనా భావాలు

1.హేబెలుది నిర్మల హృదయం. కయీనుది దుష్ట హృదయం. కనుకనే వారి కాంక్లు దేవుని అంగీకారానికీ తిరస్కారానికీ గురయ్యాయి. దేవుడు గమనించేది మన కాన్మలు గాదు, మన హృదయంలోని భావాలు.

2. దేవుడు కయీనుని ముందే మందలించాడు. నీవు మంచి పనులు చేస్తే తలయెత్తుకొని తిరుగుతావు. చెడ్డపనులు చేస్తే పాపంవచ్చి నీ వాకిట పొంచివుంటుంది. అది నిన్ను నాశం చేస్తుంది. నీవు ఆ పాపాన్ని అణగదొక్కాలి సుమా అని హెచ్చరించాడు - అది 4,7. ఐనా కయీను విన్పించుకోలేదు. అసూయకు గురై మూర్ధంగా ప్రవర్తించాడు. ఈ కయీను త్రోవలో మనం పయనించకూడదు - యూదా 11. అతనిలాగ మనం చెడ్డపనులకు పాల్పడ గూడదు -1 యోహా 3, 12.