పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/207

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రార్థనా భావాలు

1.బైబుల్లో నరుడు ప్రధానంగా సేవకుడు. దేవునికి విధేయుడై అతడు తనకు ఒప్పజెప్పిన పనిని చేసి ముగించడం అతని ప్రధాన ధర్మం. మోషే మొదలుకొని క్రీస్తువరకు వచ్చిన భక్తులంతా సేవకులుగానే జీవించారు. నేడు మనకు కూడ సేవాజీవితం తగుతుంది. మనం ప్రభువుకీ తోడి నరులకూ గూడ పరిచర్యలు చేయాలి. సేవలు చేయించుకోవడానికి కాక స్వయంగా సేవలు చేయడానికి వచ్చిన క్రీస్తు మనకు ఆదర్శం - మార్కు 10,45.

2.ప్రభువు సేవకుణ్ణి తల్లి గర్భంనుండే యెన్నుకొన్నాడు. అతనిపట్ల ప్రీతి చెందాడు-యెష 42,1. జ్ఞానస్నాన సమయంలో క్రీస్తుని గూర్చి కూడ తండ్రి యివే మాటలు పలికాడు - మత్త 3, 17. ప్రభువు సేవకుణ్ణిలాగే నూత్న వేద ప్రజలనుగూడ ఎన్నుకొన్నాడు. మనమంటే అతనికి ప్రీతి. మన తరపున మనం తండ్రికి ప్రీతి కలిగించేలా జీవించాలి.

3.సేవకుడు యిస్రాయేలుకు నిబంధనం, జాతులకు జ్యోతి - యొష 42.6. అతడు యిస్రాయేలుకు సీనాయి నిబంధాన్ని జ్ఞప్తికితెచ్చి వాళ్లు ఆ నిబంధనం షరతుల ప్రకారం జీవించేలా చేస్తాడు. వాళ్ళ పాపమంతా నిబంధనను మీరడమే. కనుక అతడు వాళ్ళు మళ్ళా నిబంధనను పాటించేలా చేస్తాడు. ఇంకా, అన్యజాతులకు యావే ధర్మశాస్త్ర జ్యోతిని అందిస్తాడు. ఆ భక్తుడు సూచించే క్రీస్తు క్రూడ నిబంధనకారుడు. సీనాయి నిబంధనానికీ బదులుగా అతడు సిలువ నిబంధనాన్ని నెలకొల్పాడు. పైగా అతడు లోకానికీ జ్యోతి — యోహా 8,12. ఈ యిద్దరు భక్తులను అనుసరించి మనంకూడ లోకం ఎదుట ప్రభువు నిబంధనంగాను, జ్యోతిగాను మెలగాలి. మన దైవభక్తివల్లా, మంచి ఆదర్మంవల్లా పదిమందిని దేవుని దగ్గరకి రాబట్టేలా జీవించాలి.

4.సేవకుడు యావే శిష్యుడు. రోజురోజు అతని వాక్కుని వినేవాడు - యెష 50,4. యావే తనకు ఒప్పజెప్పిన పనిని ఖండితంగా నెరవేర్చేవాడు. క్రీస్తు కూడ తండ్రి వాక్కుని వినేవాడు - యోహా 12, 49-50. నేడు మన తరపున మనం రోజు ప్రభువు వాక్కుని బైబుల్లోనుండి ధ్యానం చేసికోవాలి. అతడు మనలను ఏమి చేయమంటున్నాడో గుర్తించాలి. చాలమందికి ప్రభువు వాక్కూ తెలియదు. అతని చిత్తమూ తెలియదు. వాళ్ళ యిష్టం వచ్చినట్లు పాపజీవితం గడుపుతూంటారు.