పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/206

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్యజాతులకు కూడ తన్ను తెలియజేసికోగోరాడు. కనుక వారిని జాతులకు జ్యోతిగా నియమించాడు.

కాని యిస్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను పాటించలేదు. అందుకే ప్రభువు వారిని శిక్షించి బాబిలోనియా ప్రవాసానికి పంపాడు. వీరిలో కొద్దిమంది మాత్రం యావేపట్ల భక్తితో జీవించారు. వీరికి శేషజనం అని పేరు. ప్రవక్తలు విజ్ఞాన బోధకులు మొదలైన భక్తులు ఈ కోవలోకి వస్తారు. వీళ్ళు ఉమ్మడిగా "సేవకుడు” అనే బిరుదుకు తగినవాళ్ళు యెషయా 49,3 వీరిని “యిస్రాయేలు" అని సంబోధించింది.

ఈ గీతాల్లోని కొన్ని భావాలు మాత్రమే ప్రవాసంలోని యూదులే సేవకుడు అని చెప్తాయి. అన్ని భాగాలు అలా చెప్పవు. ఈ గీతాలు వ్రాసిన కవి ఆలోచనలో కొన్ని పర్యాయాలు యూద సమాజమే సేవకుడు. చాల పర్యాయాలు ఓ ప్రత్యేక వ్యక్తి (మెస్సీయా) సేవకుడు. ఈ రెండు భావాలు అతని మనసులో కలగాపులగంగా కలసిపోయాయి.

ఇక, మెస్సీయాయే సేవకుడు అనే భావాన్ని పరిశీలిద్దాం. నూత్నవేద రచయితలు పై యెషయా గీతాలను క్రీస్తుకి అన్వయించారు. వేదశాస్తులైన తొలి ఐదు శతాబ్దాల్లోని పితృపాదులుకూడ ఆలాగే చేసారు. బైబులు పండితులు చాలమంది సేవకుడు క్రీస్తేనని చెపున్నారు. కనుక నేడు మనం ఈ గీతాలను క్రీస్తుకి అన్వయించేలా చదువుకోవాలి.

తండ్రి క్రీస్తుని ఎన్నుకొని యూదుల దగ్గరికి పంపాడు. ప్రజలకు దేవుని తెలియజేసి అతని ఆజ్ఞలను బోధించడానికి క్రీస్తు వచ్చాడు. అతడు మహా ప్రవక్త యూదులు మాత్రం ఆ ప్రవక్త బోధలు ఆలించలేదు. అతడు నిర్దోషియైనా యూదులు అతనిపై నేరాలు ఆరోపించి అతడు మరణశిక్షకు గురయ్యేలా చేసారు. క్రీస్తు చనిపోతూ తన విరోధులకొరకు తండ్రికి విన్నపం చేసాడు. తన మరణాన్ని పాపపరిహార బలిగా సమర్పించాడు. అతడు లోకంలోని నరులందరికొరకూ మరణించాడు. అతని మరణంవల్లనే దేవుడు నేడు మనపాపాలను మన్నిస్తున్నాడు. తండ్రి క్రీస్తు నిర్దోషత్వాన్ని నిరూపించడానికే అతన్ని మరణంనుండి ఉత్తానం చేసాడు. అతని ఉత్తానానంతరం యూదులూ అన్యజాతి ప్రజలుకూడ అతన్ని గౌరవిస్తున్నారు. ఈలా సేవకుడు సాధించిన గొప్ప కార్యాలన్నీ మళ్ళా క్రీస్తులో కన్పిస్తాయి. కనుక అతడు సేవకుడు. సేవకుని గూర్చిన వాక్యాలను క్రీస్తు స్వయంగా తనకు అన్వయించుకొన్నాడు — లూకా 22, 22.44