పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/205

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 ఈ నాల్గవ గీతంలోని ముఖ్యభావాలు ఇవి. సేవకుడు నిరాడంబరంగా పెరిగాడు. దుషులైన ప్రజలు అతని బోధను పెడచెవిని బెట్టారు. అతన్ని బాధించి చావమోదారు. గాయాలవల్ల ఆతని దేహం కుష్టరోగి దేహంలా కన్పించింది. ప్రజలు అతడు తన పాపాల కొరకే బాధలు అనుభవించాడు అనుకొన్నారు. కాని దేవుడు అతడు ప్రజల పాపాలకొరకు గాయపడేలా చేసాడు. అతని గాయాల ద్వారా జనుల పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగింది. కడన దుష్టులైన ప్రజలు అతన్ని వధించారు. మరణసమయంలో గూడ ఆ మహానుభావుడు గొర్రెపిల్లలా మౌనంగా వుండిపోయాడు. ప్రజలు అతన్ని దుష్టుల సమాధుల ప్రక్కన పాతిపెట్టారు. అతడు యాజకుడుగా మరణించాడు. దేవుడు అతని మరణాన్ని పాపపరిహార బలిగా స్వీకరించాడు. అతని భక్తిని మెచ్చుకొని అతనికి ఉత్తానాన్ని దయచేసాడు. అతని మరణంవల్ల చాలమంది దోషవిముక్తిని పొంది అతనికి ఆధ్యాత్మిక సంతానమయ్యారు. అతడు ప్రవక్తగా ప్రజలకొరకు దేవునికి విజ్ఞాపనం కూడ చేసాడు. ఈ గీతం వర్ణించే సేవకుడు మహాభక్తుడు. ఆదర్శప్రాయుడు. ఉదాత్త వ్యక్తి. మనకు ప్రేరణం కలిగించేవాడు.

ఈ గీతంలోని వాక్యాలు చాల క్రీస్తు జీవితంలో నెరవేరాయి. అతడు లోకం పాపాలను తొలగించే గొర్రెపిల్ల - యోహా 1, 29. యూదుల న్యాయసభ తన మీద నేరాలు మోపినా తాను మాత్రం మౌనంగా వుండిపోయిన గొర్రెపిల్ల. ఈ సేవకుని చావులాగే క్రీస్తు చావకూడ పాపపరిహార బలి ఐంది. క్రీస్తు అనేకుల కొరకు తన ప్రాణాలను విమోచన క్రయధనంగా అర్పించాడు - మత్త20, 28. సేవకుళ్ళాగే అతడుకూడ దుష్టుడుగా ఎంచబడ్డాడు - లూకా 22, 37. అతనిలాగే క్రీస్తుకూడ సిలువపైనుండి విరోధుల కొరకు విజ్ఞాపనం చేసాడు - లూకా 23, 24. ఆ ప్రవాసుల్లాగే నేడు మనంకూడ గొర్రెల్లాగ దారితప్పాం. కాని క్రీస్తు మనలను మళ్ళా దారికి కొనివచ్చి తనవద్దకు చేర్చుకొన్నాడు - 1 ప్రేతు 2,22-25. పిలిప్ప యితియోపీయునికి చేసిన బోధల ప్రకారం, వధ్యస్థానానికి కొనిపోబడిన గొర్రెపిల్ల క్రీస్తే - అ, చ, 8, 32-35. సేవకుళ్ళాగే క్రీస్తుకూడ మొదట బాధలు అనుభవించి ఆ పిమ్మట మహిమలో ప్రవేశించాడు - లూకా 24, 26. అతడు తన్ను గూర్చిన ప్రవక్తల ప్రవచనాలను నెరవేర్చినవాడు - 24, 44.

సేవకుడు ఎవరు?

యెషయా గీతాలు పేర్కొన్న సేవకుడు ప్రధానంగా మెస్సీయా. కాని కొన్నిచోట్ల ఈ గీతాలు ప్రవాసంలోని యూదులకు కూడ వర్తిస్తాయి. ప్రవాసంలో బాధలు అనుభవించిన యూదులంతా ఉమ్మడిగా సేవకుడు ఔతారు. యావే వారిని ఎన్నుకొన్నాడు. వారిద్వారా