పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/204

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 4-5. కాని ప్రజల భావం తప్ప. దాసుడు మన బాధలూ, దుఃఖాలూ అనుభవించాడు. తన్ను హింసించే వాళ్ళ పాపాలకు పరిహారం చేయడానికై ఆ మహానుభావుడు తానే శ్రమలు అనుభవించాడు. అతడు అనుభవించిన శిక్షద్వారా ఇతరులు స్వస్థతను పొందారు.

6. ప్రజలు ప్రభువు మార్గాలు విడనాడి పాపపు త్రోవల్లో నడిచారు. వారి అపరాధాలకు సేవకుడు గాయపడ్డాడు.

7. దాసుడు తన పాలబడిన బాధలను ఓర్పుతో సహించాడు. మోషే, యేలీయా, యోబు మొదలైన భక్తులు తమ బాధల్లో సహనాన్ని కోల్పోయి నిషురాలు పలికారు. కాని సేవకుడు పల్లెత్తుమాట అనలేదు. యిప్రాయేలీయులు ద్రోహులయి ప్రభువుని విడనాడారు. కాపరిని వదలిపోయిన చెడ్డగొర్రెల్లా తయారయ్యారు. కాని సేవకుడు మాత్రం కాపరిని అంటిపెట్టుకొని వుండే మంచి గొర్రెలా మెలిగాడు. అతడు ప్రభువుపట్ల విధేయతా భావంతోనే వధ్యస్థానంలో చనిపోయే గొర్రెపిల్లలా ప్రాణాలు విడిచాడు. ఈ చరణంలో రచయిత రెండుసార్లు అతని మౌనాన్ని పేర్కొన్నాడు.

8. ప్రజలు అతన్ని అన్యాయంగా వధించారు. ఎవరూ అతనిపట్ల సానుభూతి చూపలేదు, అతన్ని పట్టించుకోలేదు.

9. అతన్ని గౌరవప్రదంగా గాక దుర్మార్గుల సమాధుల ప్రక్కన పాతిపెట్టారు. అనగా అతన్ని దుష్టునిగా గణించారని భావం.

10-11. దాసుడు ఓర్పుతో చనిపోయాడు కదా! ఆలాంటి పవిత్ర మరణం వ్యర్థమౌతుందా? అతని మరణం పాపపరిహార బలి ఐంది. ప్రజల పాపాలకొరకు యెరూషలేము దేవాలయంలో గొర్రెపిల్లలను బలిగా సమర్పించేవాళ్లు. దీన్ని పాపపరిహార బలి అన్నారు - లేవీ 5,14-19. దాసుని మరణాన్ని దేవుడు ఈలాంటి బలిగా స్వీకరించాడని భావం. ఇక్కడ అతడు యాజకుడుగా ప్రజలకొరకు ఆత్మార్పణం చేసికొన్నాడని అర్థం. అతని మరణంవల్ల పాపపరిహారాన్ని పొందినవాళ్ళంతా అతనికి పత్రపౌత్రులయ్యారు. సేవకుడు మరణానంతరం దీర్ఘాయువుని పొందాడు. అనగా మళ్ళా ఉత్దానమయ్యాడు. అతనిద్వారా యావే రక్షణప్రణాళిక నెరవేరింది.

12. సేవకుడు చేసిన మరోగొప్ప కార్యం, ప్రవాసంలోని యూదుల పాపాలు మన్నించమని దేవునికి విజ్ఞాపనం చేయడం. అతడు ప్రవక్తగా ప్రజలకొరకు దేవునికి విన్నపం చేసాడు. అతని భక్తి శ్రద్ధలకు దేవుడు అతన్ని ఘనుణ్ణి చేసాడు. భావితరాలవాళ్ళు అతన్ని కొనియాడతారు.