పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/187

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇది బైబుల్లోని మంచి కథల్లో వొకటి. ఈ సంఘటనం మనకు కొన్ని సత్యాలు నేర్పుతుంది. 1. దావీదు చేతికి జిక్కిన శత్రువుని చంపకుండ వదలివేసాడు ఎందుకు? అతడు దేవుని అభిషిక్తుడు గనుక, ఇక్కడ దావీదు మంచితనం, నమ్మదగినతనం విశదమౌతున్నాయి. అతడు మాటయిస్తే తప్పడు. అధికారాన్ని గౌరవిస్తాడు. ఎల్లవేళల దేవునికి విధేయుడు. రోజువారి జీవితంలో మన విరోధులు నీచంగా ప్రవర్తించవచ్చు. మనం వారిపట్ల తిరిగి నీచంగా ప్రవర్తించనక్కరలేదు. మన ఔదార్యాన్ని మనం నిలబెట్టుకోవాలి.

2. దేవుడు తన భక్తులను కాపాడతాడు. సౌలు దావీదును చంపడానికి వచ్చాడు. కాని దేవుడు దావీదును కాపాడి సౌలుకి పశ్చాత్తాపం పుట్టించాడు. పైగా సౌలునికాదని దావీదుని రాజును చేసాడు. మనకు ప్రధానంగా కావలసింది దైవబలం.

3. న్యాయం దావీదు పక్షానవుంది. సౌలు చెప్పడు మాటలువిని అన్యాయంగా దావీదును పట్టుకోవడానికి వచ్చాడు. కడన దేవుడు న్యాయాన్ని గెలిపించాడు. మన శత్రువుని మనం శిక్షించనక్కరలేదు. అవసరమొచ్చినపుడు దేవుడే ఆపని చేస్తాడు.

రెండవ సంఘటనం 2 సమూవేలు 28, 13-17 లో వస్తుంది. ఫిలిస్టీయులు బేత్లెహెము నగరాన్ని ముట్టడించారు. దావీదు అదుల్లాము గుహలో దాగివున్నాడు. అతనికి 30 మంది వీరులు స్నేహితులు. వీరిలో ముగ్గురు మిక్కిలి సాహసవంతులు. వీళ్ళు తమ నాయకుణ్ణి చూడబోయారు. దావీదు పుట్టిపెరిగింది బేత్లెహేములోనే - ఆ నగర ద్వారం దగ్గరవున్న బావినీళ్ళు అతనికి చాల యిష్టం. కనుక అతడు ఆ బావినీళ్ళు ఎవరైనా తీసికొని వస్తే ఎంత బాగుంటుంది అన్నాడు. వాటికోసం అతడు మొగంవాచి వున్నాడు. వెంటనే ఆ ముగ్గురు వీరులు బేత్లెహేము వెళ్ళారు. శత్రువులకు వెరవకుండ బావి దగ్గరకు వెళ్ళి దానినీళ్ళు తీసికొనివచ్చి దావీదు కిచ్చారు. దావీదు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకొన్నాడు. కాని తాను ఆనీళ్ళ త్రాగలేదు. ఆ ముగ్గురు తమ ప్రాణాలకు తెగించారు కనుక ఆ నీళ్ళు వాళ్ళ నెత్తురుతో సమాన మనుకొన్నాడు. కనుక వాటిని యావేకు సమర్పించి ధారగా పోసాడు. ఇది దైవారాధన. నాయకుడు, అనుచరులు అంతా ఆ యారాధనలో పాల్గొన్నారు.

ఈ సంఘటనం స్నేహం ఎలా వుండాలో తెలియజేస్తుంది. స్నేహితులకు దావీదుపట్ల గౌరవభావం వుంది. వాళ్ళ తమ ప్రాణాలు పణ్ణంగా పెట్టి దావీదుకొరకు ఆ నీళ్లు తెచ్చారు. దావీదుకి మిత్రులపట్ల గూడ ఆదరభావం వుంది. అతడు వాళ్ళు తెచ్చిన నీటికి ఎనలేని విలువనిచ్చి దాన్ని తాను త్రాగడానికి బదులుగా దేవునికి కానుకగా అర్పించాడు. మిత్రులకు నమ్మదగిన తనముండాలి. ఒకరిపట్ల ఒకరు విశ్వసనీయులుగా మెలగాలి. ఒకరికొరకొకరు ఎంత త్యాగమైనా చేయడానికి సిద్ధగా వుండాలి.