పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/186

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెళ్ళాడు. కాని దావీదు అతని అనుచరులు ఆ గుహలోనే దాగుకొని వున్నారు. సౌలుకు ఆ సంగతి తెలియదు.

దావీదు అనుచరులు శత్రువును చంపివేయమని సలహా యిచ్చారు. కాని దావీదు సౌలుకు తెలియకుండ అతని పైబట్ట అంచును మాత్రం కత్తిరించుకొని వచ్చాడు. ఈపని చేసినందుకు కూడ అతడు విచారించాడు. యూదుల భావాల ప్రకారం నరుని దుస్తులు అతని అధికారాన్ని హక్కుల్ని, వ్యక్తిత్వాన్నీ సూచిస్తాయి. కనుక దావీదు పౌలు ಬట్టని కత్తిరించాడు అంటే అతన్ని నాశం చేయడానికి పూనుకొన్నట్లే, ఈ సౌలురాజు దేవునిచే అభిషిక్తుడు. అలాంటి వాడికి దావీదు కీడు తలపెట్టడం పెద్ద పాపం. కనుక అతడు పశ్చాత్తాపపడ్డాడు -6.

సౌలు గుహనుండి వెలుపలకువచ్చి ప్రయాణం సాగిస్తున్నాడు. దావీదు అతని వెంటబోయి అతన్ని పేరెత్తి పిలిచాడు, తాను కత్తిరించిన గుడ్డముక్కను సౌలుకి చూపించాడు. నేడు నీవు నాచేతికి చిక్కినా నేను నిన్ను చంపకుండ వదలివేసాను. దీన్ని బట్టే నేను నీ మీదకు కుట్రపన్నలేదనీ, నీకు ద్రోహం తలపెట్టలేదనీ అర్థంచేసికో దేవుడు నిన్ను శిక్షించినా నేను మాత్రం నీమీద చేయిజేసికోను. ఐనా నీవు మాత్రం నావెంటబడి నన్ను తరుముతూన్నావు. నేనేపాటివాణ్ణి? చచ్చిన కుక్కతో, ఈగతో సమానుణ్ణి అన్నాడు. ఈ పలుకులు దావీదు మంచితనాన్ని వినయాన్నీ స్పష్టంగా తెలియజేస్తాయి.

ఈ పలుకులకు సౌలు మనసు కరిగింది. అతడు పసిపిల్లవాడిలాగ పెద్దగా యేడ్చాడు. అతని హృదయంలో నుండి పరాక్రమం గాక పశ్చాత్తాపం పెల్లుబికి వచ్చింది. అతడు దావీదుతో నాకంటె నీవు ఉత్తముడివి. నేను నీకు కీడు తలపెడితే నీవు నాకు మేలు చేసావు. నేను నీ ప్రాణాలు తీయగోరితే నీవు నా ప్రాణాలు కాపాడావు. చేతికి జిక్కిన శత్రువును ఎవడు వదలివేస్తాడు? నీ మంచితనానికి ప్రభువు నీకు మేలు చేయునుగాక అన్నాడు.

పైగా సౌలు దావీదుతో నీవు రాజమోతావని ప్రవచనం చెప్పాడు-20. నీవు రాజువయ్యాక నా కుటుంబాన్ని నాశం చేయవద్దని బతిమాలుకొన్నాడు. పూర్వం గెల్చినరాజు ఓడిన రాజు కుటుంబాన్ని సర్వనాశం చేసేవాడు. కనుక ఇక్కడ సౌలు దావీదుని ముందుగానే బతిమాలాడు. ఇకమీదట యిస్రాయేలు రాజ్యం సౌలుకీ అతని కుమారుడు యోనాతానుకీ దక్కదు. అన్యుడైన దావీదుకి దక్కుతుంది. ఈ యధ్యాయంలో రచయిత చెప్పదలచుకొన్న ప్రధానాంశం ఇదే. రాజు కోరినట్లే దావీదు తాను సౌలు కుటుంబాన్ని రూపుమాపనని ప్రమాణం చేసాడు. సౌలు దావీదును జయించాలని వచ్చాడు. కాని కడన దావీదే సౌలుని జయించాడు.