పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/185

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు ఆజ్ఞపై యోషువ యిస్రాయేలు ప్రజలను ప్రోగుచేయించాడు. వారిని గోత్రాల క్రమంగా, వంశాల క్రమంగా, కుటుంబాల క్రమంగా తన యెదుటికి పిలిపించాడు. కడన సబ్ది కుటుంబానికి చెందిన ఆకాను దోషి అని తేలింది. ఇతని పాపంవల్లనే యిస్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయింది.

- యోషువా ఆకానును బుజ్జగించి నీవు నిజం చెప్పి దేవుణ్ణి స్తుతించమన్నాడు. ఆకాను తనతప్పు ఒప్పకొన్నాడు. అతడు యెరికో యుద్ధం జరిగేప్పుడు ఒక సీనారు బట్ట, రెండువందల తులాల వెండి, ఏబది తులాల బంగారం చేజిక్కించుకొని తన గుడారంలో దాచుకొన్నాడు. ఇవి శాపగ్రస్తమైన వస్తువులు. వీటిని నాశం చేయాలి. కాని ఆకాను వీటిని దాచుకొన్నాడు. అందుకే యిస్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయింది.

యోషువా ఆకాను గుడారం నుండి ఆ మూడు వస్తువులను తెప్పించాడు. ఆకానునీ, అతని కుటుంబాన్నీ ఆ వస్తువులను ఆకోరు లోయలోనికి తీసికొని పోయాడు. అక్కడ అతన్నీ అతని కుటుంబాన్నీ వస్తువులనూ అన్నిటినీ రాళ్ళతోకొట్టి కాల్చివేసారు. అనగా వాళ్ళందరినీ శాపంపాలు చేసారు. ఆకోరు అంటే శ్రమ పెట్టడం. ఆకాను తన దురాశ ద్వారా యిస్రాయేలు సైన్యాన్ని శ్రమపెట్టాడు. దానికి శిక్షగా యోషువా ఆకానుని శ్రమ పెట్టాడు. యోషువా ఆతావున పెద్దరాళ్ళ గుట్టను పేర్చాడు.

ఇది కథ. ఈ కథ నేడు మనకు కొన్ని సత్యాలు నేర్పుతుంది. 1. యిప్రాయేలు ప్రజల దేవుని నిబంధనను మీరినప్పుడు యుద్ధంలో ఓడిపోయారు. దాన్ని పాటించనపుడు గెల్చారు. దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మనకు అతని దీవెనలు లభిస్తాయి. ఆ యాజ్ఞలు మీరితే శాపాన్ని తెచ్చుకొంటాం.

2. ఆకాను పాపం దురాశ, దేవుడు నాశం జేయమన్న వస్తువులను అతడు ఆసబోతుతనంతో దక్కించుకొన్నాడు. ఆ పాపమే అతని ప్రాణాలు తీసింది. గెహాసి, యూదా, అననీయా సఫీరా మొదలైన వాళ్ళంతా దురాశ వల్లనే నాశమయ్యారు. ఈనాడు మనంకూడ అత్యాశకుబోయి చేటు తెచ్చుకొంటాం. కనుక మనం ఏ వస్తువులను అక్రమంగా కోరుకొంటున్నామా అని పరిశీలించి చూచుకోవాలి.

4. దావీదు కథలు

ఇక్కడ దావీదు చరిత్ర నుండి మూడు సంఘటనలను పరిశీలిద్దాం. మొదటి కథ 1సమూవేలు 24లో వస్తుంది, అతడు 600 మంది అనుచరులతో ఎంగడీ యెడారిలోని కొండల్లో దాగివున్నాడు. సౌలురాజు దావీదును పట్టుకోవడానికి 3000 మంది సైనికులతో ఆ ప్రాంతానికి వచ్చాడు. సౌలు దారినపోతూ మలవిసర్జనకు ఒక కొండ గుహలోకి