పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/184

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎలియాసరు కథ మనకు కొన్ని సత్యాలు నేర్పుతుంది. 1. మన పాపాన్ని చూచి ఇతరులు అసమార్గం పడతారు. తోడివారికి, విశేషంగా చిన్నవారికి మనం మంచి ఆదర్శం చూపించాలి. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? కనుకనే యెలియాసరు ఇతరులకు నీతిని బోధించడానికి ప్రాణత్యాగం చేసాడు.

2. ఎలియాసరు యూదజాతి కంతటికీ మంచి ఆదర్శాన్ని చూపించాడు. ఆతని మరణంవల్ల ప్రేరణం పొందే పూర్వకథలోని ఏడురు సోదరులు ప్రాణత్యాగం చేసారు. మంచి ఆదర్శానికి ఇంతశక్తివుంది. కనుక నేడు మనం దురాదర్శానికి దూరంగా వుండాలి. మంచి ఆదర్శాన్ని చూపడానికి సిద్ధంగా వుండాలి. మదర్ తెరేసాను చూచి నేడు చాలమంది పేదసాదలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. విశేషంగా వేదహింసల కాలంలో మనం ధైర్యంతో మన భక్తి విశ్వాసాలను ప్రకటించాలి.

3. ఆకానుకు శిక్ష - యెహోషువ 7

ఆది క్రీస్తు పూర్వం 12వ శతాబ్దం. మోషే గతించాక యోషువ ప్రజలకు నాయకుడయ్యాడు. అతడు యావే ఆజ్ఞపై కనాను మండలాన్ని జయిస్తున్నాడు. అప్పటికే యెరికో అతని వశమైంది. ఆ మీదట హాయి పట్టణాన్ని జయించడానికి 3000 మంది ప్రజలను పంపాడు. కాని హాయి పౌరులు వారిని యుద్ధంలో ఓడించి చంపివేసారు. యిస్రాయేలీయులకు గుండె చెదిరింది. కనానీయులు ఈ వోటమిని గూర్చి విని యిస్రాయేలీయుల మీదికి దండెత్తివచ్చి వారిని నాశం చేయవచ్చు. కనుక యోషువా, ప్రజలు, పెద్దలు సంతాపసూచకంగా తమ వస్తాలు చించుకొన్నారు. తలపై దుమ్ము పోసికొని యావే ముందట సాష్ట్రాంగపడి ప్రార్థన చేసారు.

ప్రభువు యోషువాకు సమాధానం చెప్పాడు. యిస్రాయేలీయులు శాపగ్రస్తమైన వస్తువులను దొంగిలించి దాచుకొన్నారు. కనుక ప్రభువుకి వారిపై కోపం వచ్చి హాయి యుద్ధంలో వాళ్ళు ఓడిపోయేలా చేసాడు. దైవ ప్రజలు ఏదైనా నగరాన్ని జయించినపుడు అక్కడి నరులను, జంతువులను, వస్తువులను అన్నిటినీ శాపం పాలుచేసి నాశం చేయాలి. తాము ఏమీ దక్కించుకో గూడదు. ఇది దేవుని ఆగ్న- ద్వితీ 7, 1–4, వాళ్ళు ఈ యాజ్ఞమీరి హాయిని జయించినపుడు అక్కడి వస్తువులు కొన్నిటిని దాచుకొన్నారు. కనుక ప్రభువు వారిపై కోపించి హాయి పట్టణ యుద్ధంలో వారికి అపజయం కలిగించాడు.