పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/181

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఐదవ కుమారుడు

సైనికులు ఐదవవాణ్ణి బాధించారు. మామూలు శిక్షలకు గురిచేసారు. అతడు గడసుతనంతో రాజవైపు తేరిపారజూచి ఓయి! నీవు అధికార బలంతో మమ్ము శిక్షిస్తున్నావు. ఐనా దేవుడు మా ప్రజను చేయివిడువ లేదు. అతడు మా జనాన్ని తప్పక ఆదుకొంటాడు. నిన్ను నీ అనుచరులను మాత్రం శిక్షించితీరుతాడు అన్నాడు. 16-17. అంటియోకస్ వేద హింసలవల్ల యూదప్రజ నాశమైపోదని ఇతని నమ్మకం.

ఆవర కొడుకు

ఆరవవాడి వంతు వచ్చింది. భటులు అతన్ని కూడ మామూలు పద్ధతిలోనే హింసించారు. ఇతడు ఒక గొప్ప సత్యాన్నితెలియజేసాడు. మా పాపాలవల్లనే మాకీ శిక్షలు వచ్చాయి అన్నాడు–18. యూదుల పాపం ధర్మశాస్తాన్నిమీరడమే. ఈ పాపం యూద సమాజానికంతటికీ తిప్పలు తెచ్చిపెట్టింది. పాపానికి సమాజాన్నంతటినీ బాధించడం అనే దుప్రభావం వుంటుంది. బైబులు ఈ సూత్రాన్ని చాలాసార్లు పేర్కొంటుంది.

ఏడవవాడు

సైనికులు ఏడవవాణ్ణి కూడ ఘోరశ్రమలకి గురిచేసారు. అతడింకా పసివాడు. ఐనా రాజుతో ఈలా అన్నాడు. మా సోదరుల మరణం మా ప్రజల పాపాలకు పరిహారం చేస్తుంది. దేవుడు మా శ్రమలను, చావులను చూచి మా ప్రజల పాపాలు క్షమిస్తాడు. యిస్రాయేలు ప్రజలు ఇకమీదట శ్రమలు అనుభవించరు 37-38. మన శ్రమలు ఇతరుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తాయి అనేది కూడ గొప్పభావం.

తల్లి

ఈ తల్లి తన బిడ్డల కంటెను అధికమైన భక్తివిశ్వాసాలు, ధైర్యసాహసాలు కలది. ఆమె తన యేడుగురు కుమారులు ఒక్కరోజులోనే చనిపోవడాన్ని చూచి తల్లడిల్లిపోయింది. కాని ప్రభువును నమ్మి ఆ దుఃఖాన్ని ఓపికతో భరించింది. ఆమెలో స్త్ర్రీలా ప్రేమ పురుషుల ధైర్యమూ రెండూ వున్నాయి. కనుక ఏడుగురు బిడ్డలను ఈలా ప్రోత్సహించింది. నాయనాలారా! మీరు నా కడుపున ఎలా వూపిరి పోసికొన్నారో నాకు తెలియదు. మీకు ఈ అవయవాలను ఇచ్చింది నేనుకాదు. అన్ని జీవులకు ప్రాణం పోసినవాడే మీకుకూడ జీవమిచ్చాడు. అతడు చనిపోయాక మీకు మళ్ళా ఉత్దానాన్ని దయచేస్తాడు. కనుక మీరు ధైర్యంతో ప్రాణాలు అర్చించండి-23.