పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/171

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. కథా సంగ్రహం

న్యాయాధిపతుల కాలంలో ఓ యూదకుటుంబం బేల్లెహేమునుండి మోవాబు దేశానికి వలసపోయింది. అక్కడ తండ్రి ఎలీమెలెకు చనిపోయాడు. ఇద్దరు కొడుకులు మహాల్లోను, కిల్యోను అనేవాళ్లు మోవాబు పడుచులైన రూతు, ఓర్చాలను పెండ్లి చేసికొన్నారు. పెండ్లయ్యాక ఈ కొడుకులు కూడ సంతానం లేకుండానే చనిపోయారు. బేల్లెహేమలో కరవు తీరింది కనుక తల్లి నవోమి తిరిగి అక్కడకి వెళ్లగోరింది. ఓర్చా వెళ్లిపోయింది గాని రూతు అత్తవెంట బేల్లెహేముకి వచ్చింది.

రూతు బోవసు అనే ధనవంతుని పొలంలో పరిగలేరుకోవడానికి పోయింది. ఇతడు ఎలీమెలెకుకి దగ్గరిచుట్టం కనుక ఈ వితంతువుని పట్టించుకోవలసినవాడు. నవోమి రూతుని బోవసుకి పెండ్లిచేసి ఆమెకు సంతానాన్ని కలిగించాలని సంకల్పించుకొని ఒక పథకం పన్నింది. అత్త ఆదేశం ప్రకారం రూతు రాత్రిలో బోవసు కళ్లానికి వెళ్లి అతన్నితన్ను పెండ్డాడమని వేడుకొంది. నవోమికి దగ్గరి చుట్టం బేల్లెహేములో మరొకడున్నా అతడు ఆమెను పెండ్లి జేసికోవడానికి ఇష్టపడలేదు. కదన బోవసే ధర్మబద్ధంగా ఆమెను వివాహమాడాడు. వారికి ఓబేదనే బిడ్డడు పుట్టి నవోమికి ఆనందం కలిగించాడు. ఈ వోబేదు మనుమడే దావీదు. ఇక ఈ చరిత్రను విపులంగా పరిశీలించి చూద్దాం.

3. వివరణం

1. మోవాబులో నవోమి 1, 1-22

కరవువల్ల ఎలీమెలెకు, నవోమి, వారి కుమారులు మహాల్లోను, కిల్యోను యూదా నుండి మోవాబు దేశానికి వలసపోయారు. అక్కడ కొడుకులిద్దరు మోవాబు పడుచులను పెండాడారు. మహాను భార్య రూతు. కిల్యోను భార్య ఓర్చా పదేండ్లయ్యాక తండ్రీ కొడుకులు చనిపోయారు. ఇక ముగ్గురు వితంతువులు మాత్రమే మిగిలారు. యూద సమాజంలో వితంతువులు దిక్కులేనివాళ్లు.

ఇంతలో యూద దేశంలో వానలు కురిసి పంటలు పండాయి. కనుక నవోమి బేల్లెహేముకి తిరిగిరాగోరింది. ఆమె కోడళ్లను పుట్టనింటికి వెళ్ళి మల్లా పెండ్డాడి బిడ్డలను కనమంది. వారు తన పట్ల ఆదరంతో మెలిగినట్లే దేవుడు కూడ వారిపట్ల ఆదరంతో మెలగాలని కోరుకొంది - 1,8. చిన్నకోడలు ఓర్చా పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె చేసింది మంచి పనే. కాని పెద్దకోడలు రూతు ఇంకా మంచి పని చేసింది.