పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/170

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

హామాను మోసంతో పారశీకంలోని యూదులను తెగటార్చేవాడే కాని దైవకటాక్షం యూదులను కాపాడింది. దేవుణ్ణి నమ్మి అతని సహాయాన్ని అడుగుకొంటే మన జీవితం సురక్షితంగా వుంటుంది.

ఈ గ్రంథంలో రాజకీయమైన ఎత్తులు, ఎదురెత్తులు వున్నాయి. పారశీకులు యూదులను నాశంజేయగోరితే యూదులు వారికి ప్రతీకారం చేసారు. నూత్న వేదంలో మనం శత్రువు మీద పగతీర్చుకోకూడదు. అతన్ని క్షమించి వదలివేయాలి. క్రీస్తు అందరినీ ఐక్యంజేసి శాంతిని చేకూర్చిపెట్టేవాడు - ఎఫే 2, 14-15. కనుక ఈ పుస్తకంలోని శత్రుశిక్షణం మనకు ఆదర్శం కాదు.

4. రూతు గ్రంథం

1. గ్రంథ స్వభావం

ఈ పుస్తకం క్రీ.పూ. 5వ శతాబ్దానికి చెందిన రచన. దీనిలోని విషయం మాత్రం న్యాయాధిపతుల కాలానికి చెందింది 1200. ఇది చారిత్రక గ్రంథం. ఇది చిన్న నీతి కథ. కనుక మిడ్రాష్ పుస్తకాల్లో చేర్చాం, యూదులు దీన్ని ఉత్సవదినాల్లో చదివేవాళ్లు.

దీనిలో తోబీతు గ్రంథంలోలాగ అద్భుతాలు, దేవదూతల జోక్యం మొదలైన అసాధారణ సంఘటనలు ఏమీ వుండవు. పైరుపండి కోతకోయడం, పరిగలు ఏరడం, కరువు, పెండ్లి, శిశుజననం, మరణం మొదలైన రోజువారి సంఘటనలు మాత్రమే కన్పిస్తాయి.

ఇంకా ఈ గ్రంథంలో పురుషుల ప్రాముఖ్యం వుండదు. నవోమి, రూతు అనే ఇద్దరు స్త్రీలు కథ నడుపుతారు. వాళ్లు నిర్ణయాలు చేసి కథను సుఖాంతం చేస్తారు. ప్రాచీన యూద సమాజంలో స్త్రీలకు ప్రాముఖ్యం లేదు. ఆ కాలంలో రచయిత ఈలాంటి కథను ఏలా అల్లాడా అని ఆశ్చర్యం కలుగుతుంది.

ఈ కథలో నిబంధనకు అధిక ప్రాముఖ్యం వుంటుంది. సినాయి నిబంధనం ద్వారా యావే ప్రభువు యిప్రాయేలీయుల పట్ల కరుణాజూపాడు. అతని పేరుమీదిగా యూదులు కూడ ఒకరిపట్ల ఒకరు దయ జూపాలి, రూతు నవోమి పట్ల కరుణ జూపడం ఈ పుస్తకంలో ఓ ముఖ్యాంశం.

ఇది కళాత్మకమైన కథ. గ్రంథం ఎలా ముగుస్తుందా అని చివరిదాకా ఉత్కంఠ కలిగిస్తుంది. కథ చివరిదాకా పవిత్రంగా, నిర్మలంగా నడుస్తుంది.