పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/161

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీళ్ళు ఈయకపోతే లొంగిపోదాం అన్నాడు. ఉజ్జీయా గడువుతో కలుపుకొని మొత్తం 39 రోజులు ఔతాయి. 38వ రోజు యూదితు ద్వారా ప్రజలకు విమోచనం లభిస్తుంది.

3. యావే ప్రతినిధిగా యూదితు 8, 1=10, 10

యూదితు యువ వితంతువు. యూద సమాజంలో వితంతువులు దీనుల వర్గానికి చెందినవాళ్ళు ఐనా ప్రభువు ఈ దీనురాలి ద్వారానే విజయాన్ని ప్రసాదిస్తాడు. ఆమె పేరుకి యూదజాతి స్త్రీ అని అర్థం. యూదితు అందగత్తె. అందమనే ఆయుధం తోనే ఆమె శత్రువును జయిస్తుంది. ఆమె భక్తిమంతురాలు. గోనె తాల్చి ప్రార్థనలు, ఉపవాసాలు చేసేది. కనుక ఆమె ప్రభువు చేతిలో యోగ్యురాలైన సాధనం.

నగర పెద్దలు ఐదు రోజుల్లో యావే సహాయం అందకపోతే శత్రువుకి లొంగి పోదామన్నారు కదా! యూదితు ఈ నిర్ణయం పొసగదని చెప్పింది. అది దేవుణ్ణి పరీక్షించినట్లవుతుందని వాకొంది. కనుక ఆ నిర్ణయాన్ని రద్దు చేయించింది. యూదులది పురుషాధిక్య సమాజం. అలాంటి సమాజంలో ఓ స్త్రీ పురుషుల నిర్ణయాన్ని మార్చివేసి క్రొత్త నిర్ణయం చేసింది. ఆమె శత్రువుకి లొంగవద్దనీ అతన్ని ఎదిరించమనీ ఆజ్ఞాపించింది. తాను శత్రువు శిబిరానికి వెళ్ళి నగరాన్ని కాపాడతానని చెప్పింది. కాని అది యేలాగో తెలియజేయలేదు. ఆమె మనసులో వున్న ప్రణాళికను దేవుడు ఆమోదిస్తాడో లేదోకూడా ఆమెకు ముందుగా తెలియదు. ఐనా దేవునిపై భారంవేసి కార్యానికి పూనుకొంది.

ఆమె విరోధుల శిబిరానికి వెళ్ళకముందు తలమీద బూడిద చల్లుకొని, గోనెతాల్చి వినయంతో ప్రార్ధన చేసింది. "ప్రభూ! నీవు సైనికుల సంఖ్యపై, బాలాఢ్యుల బలంపై ఆధారపడవు. నీవు పీడితులకు సహాయుడవు" అని దేవునికి మొరపెట్టింది - 9,11. ఈవిధంగా దైవబలాన్ని పొంది కార్యాచరణకు పూనుకొంది.

ఇంకా ఆమె చక్కగా అలంకరించుకొని విరోధుల విడిదికి పోయింది. ఆమె అందానికి నగరానికి కావలి కాసే యిప్రాయేలీయులే ముగ్గులయ్యారు. ఈ యందం ఆమె ఆయుధం. దీనితోనే ఆమె శత్రువుని జయిస్తుంది. మనం మన అందాన్ని దుర్వినియోగం చేస్తాం. కాని యూదితు దాన్ని దైవకార్యానికి ఉపయోగించి సద్వినియోగం చేసికొంది.

4. యూదితు శత్రు శిబిరానికి వెళ్ళడం 10, 11-13, 20.

ఆ ధీరురాలు దాసితో బెతూలియా నగరద్వారం దాటి శత్రువుల శిబిరంలో ప్రవేశించింది. అక్కడ గస్తీ కాసేవాళ్ళను నమ్మించి నేను మీ సేనాపతికి విశ్వసనీయమైన