పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

3. నరుల సహాయం. ఇతియోపీయుడు యెరూషలేమలో ప్రభువుని సేవించుకొని రథమెక్కి తిరిగిపోతూ యెషయా ప్రవచనం చదువుకొంటున్నాడు. “అతన్ని ఓ గొర్రెపిల్లలా వధ్యస్థానానికి నడిపించుకొనిపోయారు" అన్న వాక్యం అర్థంగాక తికమకలు పడుతున్నాడు. అప్పడు ఫిలిప్ప ఆ వాక్యం క్రీస్తుకి వర్తిస్తుందని తెలియజెప్పి అతనికి క్రీస్తుని బోధించాడు. జ్ఞానస్నాన మిచ్చాడు. - ఆచ 8, 36–39. గ్రంధాన్ని అర్థం చేసికోవడానికి బోధకుల ఉపన్యాసాలూ, వాఖ్యాగ్రంథాలూ, పత్రికలూ మొదలైనవి ఉపయోగపడతాయి. ఈ సహాయాలన్నిటినీ మనం తప్పకుండా వినియోగించుకోవాలి. రక్షణార్ధనంలో భగవంతుడేకాక నరుడుకూడ నరుడికి ఉపయోగపడతాడు.

4. విమర్శనా దృష్టి పౌలు అతని శిష్యుడు సీల బెరియాకు వెళ్ళి అక్కడి యూదులకు సువిశేషబోధ చేసారు. ఆ ప్రజలు పౌలు సందేశాన్ని ఆసక్తితో విన్నారు. అతడు చెప్పింది నిజమా కాదా అని పరిశీలించి చూడ్డానికి వాళ్ళు అనుదినం పరిశుద్ధగ్రంథాన్ని తిరగవేసేవాళ్ళు, కడన ఆ యూదులు క్రీస్తు శిష్యులయ్యారు - ఆచ 17,10-12, బైబులుని ఎప్పడుకూడ ఆలోచనాత్మకంగా చదవాలి. తెలివితేటలతో దానిలోని పూర్వాపరాలను గుర్తిస్తుండాలి.

5. దేవుని సందేశాన్ని భక్తితో వినాలి. దేవుడు తనతో మాటలాడబోగా బాలుడైన సమూవేలు భక్తిభావంతో "ప్రభూ! నీ దాసుడ్డి, నీ సందేశాన్ని వినడానికి సిద్ధంగానే వున్నాను" అన్నాడు-1 సమూ 3, 10. నెహెమ్యాగ్రంథాన్ని చదువుతూండగా యూదభక్తులు నిలుచుండి శ్రద్ధతో ఆలించారు. నెహె 8,5. బెతనీ మరియ ప్రభువుకి శిష్యురాలై అతని పాదాల చెంత కూర్చుండి అతని బోధలు శ్రద్ధతో వింది - లూకా 10, 39. ఈ భక్తుల్లాగే మనంకూడ దేవుని సందేశాన్ని భక్తితో ఆలించాలి. గ్రంథంలోనుండి ప్రభువు ఈనాడూ మనతో మాటలాడతాడు. అతడే స్వయంగా ఉపాధ్యాయుడై భక్తులకు బోధ చేస్తుంటాడు- యోహా 6,45.

6. వాక్యాన్నిపాటించాలి. వాక్యాన్ని వింటేనే చాలదు, దాన్నిధ్యానం చేసికొంటేనే చాలదు. అనుదిన జీవితంలో దాన్ని పాటించాలి కూడ. వాక్యాన్ని కేవలం విని మరిచిపోతే ఆత్మవంచనం చేసికోవడమే ఔతుంది. విన్నదాన్ని జీవితంలో పాటిస్తే దేవునినుండి దీవెనలు పొందుతాం - యాకో 1,22. అలా పాటించినవాడు రాతి పునాదిమీదా, పాటించనివాడు ఇసుక పునాది మీదా ఇల్లు కట్టినవాడవుతాడు మత్త 7, 24-27. బైబులు వాక్కులకు మన జీవితాన్ని సవరించి మన తప్పలను సరిదిద్దేశక్తి వుంది - 2 తిమొ 3, 16-17. అది ఓ న్యాయాధిపతియై మనకు తీర్పు చెపుతుంది కూడ - హేబ్రే 4, 12.