పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/158

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. పుస్తకం సందేశం

తోబీతు గ్రంథం మొదటినుండి చివరిదాక దైవభక్తితో నిండివుంటుంది. ఈ పుస్తకంలో రఫాయేలు పాత్ర దేవుడు నరులను ఆదుకొంటాడు అని చెప్తుంది. తోబీతు పాత్ర ఓర్పునీ, కరుణ కార్యాలనూ తెలియజేస్తుంది. అతడు ఆదర్శ భక్తుడు. తోబియా పాత్ర తల్లిదండ్రులపట్ల భక్తిగౌరవాలు కలిగి వుండాలని చెప్తుంది. తోబియా సారాలది పవిత్రమైన వివాహ బంధం.

గ్రంథంలో ధర్మశాస్తాన్ని పాటించడం, దానధర్మాలు, ప్రార్థన, ఉపవాసం మొదలైన అంశాలు వస్తాయి. ఇది విశేషంగా కుటుంబ భక్తిని వర్ణిస్తుంది. పేదలకు అన్నం పెట్టడం, బట్టలీయడం, మృతులను పాతిపెట్టడం, తల్లిదండ్రులు బిడ్డల మధ్య అనురాగం నెలకొనడం, పెద్దల ఉపదేశాలు వినడం మొదలైన అంశాలు గ్రంథమంతట వస్తాయి.

రఫాయేలు అస్మోదియసును ఓడించి తోబియా సారాలకు మేలు చేసాడు. నేడు మన జీవితంలో మనం దేవదూతలపట్ల భక్తిని పెంచుకొంటే వారినుండి ఎన్నో వుపకారాలు పొందుతాం.

ప్రార్థనలు, దేవునికి మొరపెట్టడం, దైవస్తుతులు, నీతివాక్యాలు గ్రంథంలో కోకొల్లలుగా వుంటాయి. కనుక ఈ పుస్తకాన్ని చదువుతుంటే దేవాలయంలో ప్రార్ధన చేసికొన్నట్లుగానే వుంటుంది.

క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో గ్రీకు రాజులనుండి హింసలనుభవించే యూదులను ప్రోత్సాహించడానికి రచయిత ఈ గ్రంథాన్ని వ్రాసాడు. ఏ దోషం లేకున్నా సారా శ్రమలకు గురైంది. పుణ్యకార్యాలు చేసినా తోబీతు బాధలు అనుభవించాడు. నీతిమంతులైన యాకోబు యోసేపుల్లాగే, తోబియా సారాల్లాగే యూదులు కూడా కొన్ని శ్రమలు అనుభవించాలని ఈ గ్రంథకర్త హెచ్చరించాడు. నేడు మన జీవితంలో కూడా శ్రమలు తప్పవు.

ప్రాచీన కాలంనుండి క్రైస్తవులు ఈ గ్రంథాన్ని భక్తితో చదువుతూ వచ్చారు. మనకు బాగా వుపయోగపడే బైబులు గ్రంథాల్లో ఇదీ ఒకటి. ఈ పొత్తం ప్రధానంగా కుటుంబ భక్తినీ, కుటుంబ ధర్మాలనూ బోధిస్తుంది. కనుక మన విశ్వాసులు ఈ పుస్తకాన్ని శ్రద్ధతో చదవాలి. ఇది మంచి కథ. కనుక విసుగు పుట్టించదు. ఇంటిలో మన పిల్లల చేతకూడా ఈ పుస్తకాన్ని చదివించాలి. పింగళి యెల్లన అనే ప్రాచీన కవి ఈ పుస్తకాన్నిసర్వేశ్వర మహాత్త్వం” అనే పేరుతో పద్యకావ్యంగా వ్రాసాడు.