పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/155

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆస్మోదియస్ అనే దయ్యం ఆ భర్తలను చంపివేసేది. ఈ యిరువురు భక్తులను కాపాడ్డానికి దేవుడు రఫాయేలు దేవదూతను పంపాడు. కాని అతడు దేవదూత అని సారా తోబీతులకు తెలియదు. వాళ్ళు అతన్ని సామాన్య నరునిగానే భావించారు.

సొమ్మను వసూలు చేసికొని రావడానికి రఫాయేలు తోబియాను మాదియా దేశానికి కొనిపోయాడు. దారిలో అతన్ని చేపబారినుండి కాపాడాడు. తోబియా చేప కాలేయం పొగతో అస్మోదియస్ను తరిమివేసి సారాను పెండ్డాడాడు. రఫాయేలు గబాయేలు నుండి సొమ్ముకూడ తెచ్చియిచ్చాడు.

తోబియా డబ్బుతో, వధువుతో సురక్షితంగా తిరిగివచ్చాడు. చేప పిత్తాన్ని పూసి తండ్రి గుడ్డితనాన్ని తొలగించాడు. సన్మనస్కుడు తండ్రికుమారులకు తానెవరో తెలియజేసికొని అదృశ్యుడయ్యాడు. తండ్రికుమారులు నివ్వెరపోయి దేవుణ్ణిస్తుతించారు.

3. వివరణం

1. తోబీతు సారాల దురవస్థ 1, 1-3, 17

తోబీతు అస్సిరియా దేశంలోని నీనివే పట్టణంలో ప్రవాసి. దైవభక్తి కలవాడు. తోబీతు అనే పేరుకి దేవుడు మంచివాడు అని అర్థం. తోబీతు పేదలకు అన్నంపెట్టి బట్టలిచ్చేవాడు. నీనివేలో శత్రువులు చంపివేసిన యూదులను పాతిపెట్టేవాడు. ఏటేట యెరుషలేము యాత్రచేసి తన పంటలో పదవవంతు చెల్లించేవాడు. ధర్మశాస్త్రం విధించిన భోజనాన్నే తినేవాడు. ఇవి అతని పుణ్యకారాలు.

అతని భార్య అన్నా కుమారుడు తోబియా. వాళ్ళ పవిత్రమైన కుటుంబ జీవితం గడిపేవాళ్ళు. తోబీతు మాదియా దేశంలోని రాగీసులో వసించే గబాయేలు వద్ద సొమ్ము దాచాడు.

తోబీతుకి కష్టకాలం దాపరించింది. రాజు అతని ఆస్తిని తీసికోగా అతడు పేదవాడయ్యాడు. గోడ ప్రక్కన పండుకొని వుండగా పిచ్చుకలు అతని కండ్లల్లో రెట్టవేసాయి. అతనికి చూపుపోయింది. అతని భార్య అన్నా కూలికి పోయి యజమానుడు తనకు కానుకగా ఇచ్చిన మేకపిల్లను తీసికొని వచ్చింది. తోబీతు భార్య దొంగతనం చేసిందనుకొని ఆమెను మందలించాడు. కాని ఆమె పెనిమిటి మీద తిరగబడి అతన్ని నిందించింది. కనుక తోబీతు దుఃఖంతో దేవా! నీవు నా ప్రాణాలు తీసికొనిపో అని ప్రార్థించాడు.

అదేరోజు ఎక్బటానాలోని రగూవేలు కూతురు సారా కూడ దుఃఖానికి గురైంది. ఆమెకు ఏడుసార్లు పెండ్లయింది. కాని ప్రతిసారీ అస్మోదియస్ అనే దయ్యం ఆమె భర్తలను చంపివేసేది. ఒక రోజు సారా పనికత్తె ఆమెను నిందించింది. కనుక సారా దుఃఖంతో