పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/154

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కథ. కనుక దీన్నికూడా మిడ్రాష్ పుస్తకాల్లో చేర్చాం. మనదేశంలో భక్తుల చరిత్రలు ఈ మిడ్రాష్ కథలకు దగ్గరగా వుంటాయి. నేడు మనం ఈ కథలను చదివి దైవభక్తిని పెంపొందించుకోవాలి.

1. తోబీతు గ్రంథం

1. గ్రంథ స్వభావం

ఈ పుస్తకాన్ని క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో అరమాయిక్ భాషలో వ్రాసారు. ఇప్పడు గ్రీకు మూలం మాత్రమే లభిస్తుంది. ఈ గ్రంథాన్ని ప్రోటస్టెంటులు అంగీకరింపరు. రెండు మూడు జానపద కథలు ఈ పుస్తకానికి ఆధారం. రచయిత ఈ జానపద కథలను ఆధారంగా చేసికొని, ద్వితీయోపదేశకాండంలోని నీతిబోధలను చేర్చి నేర్చుతో తోబీతు కథను తయారుచేసాడు.

తోబీతు, సారా యిద్దరు కష్టాల్లోవుండి దేవునికి మొరపెట్టారు. చనిపోగోరారు. దేవుడు రఫాయేలు దూతను పంపి వారిద్దరినీ ఆదుకొన్నాడు. ఇలా ఈ పుస్తకం రెండు భక్తిగల కుటుంబాలు వివాహంద్వారా ఐక్యం గావడాన్ని వర్ణిస్తుంది. ఇది బైబుల్లో అతి శ్రేష్టమైన గ్రంథాల్లో ఒకటి. ప్రాచీనకాలం నుండి క్రైస్తవలోకాన్ని ప్రభావితం చేసింది.

ఈ పుస్తకం పుట్టుక సందర్భం ఇది. క్రీస్తు పూర్వం 200 ప్రాంతంలో గ్రీకు రాజులు యూదులను మతపరంగా హింసించారు. ఈ సందర్భంలో యూదులను ప్రోత్సహించడానికి రచయిత ఈ గ్రంథాన్ని వ్రాసాడు. దేవుడు మీ మధ్యలోనే వున్నాడు. మీ కష్టాలను తొలగిస్తాడు. మీరు మాత్రం అతన్ని నమ్మండి అని ప్రజలను హెచ్చరించాడు. శ్రమల్లో చిక్కిన తోబీతుని లాగే మిమ్మకూడా కాపాడతాడని నొక్కి చెప్పాడు. నేడు మనకు కూడా ఈ పుస్తకం దేవుడు మీ కష్టాల్లో మిమ్ము ఆదుకొంటాడు అనే ఆశాభావం పుట్టిస్తుంది.

2. కథా సంగ్రహం

తోబీతు నీనివే నగరంలో ప్రవాసంలో వున్నాడు. అతడు దైవభక్తుడు. పేదలకు దానధర్మాలు చేయడం, చనిపోయిన వారిని పాతిపెట్టటం మొదలైన పుణ్యకార్యాలు చేసేవాడు. నీనివేలో ప్రవాసంలో వున్నపుడు అతనికి చూపుపోయింది. అతని ఆస్తిపోయింది. కనుక కష్టాల్లో చిక్కుకొన్నాడు. తన ప్రాణాన్ని తీసికొనిపొమ్మని దేవునికి మొరపెట్టాడు. అంతకుముందే అతడు మాదియా దేశంలోని గబాయేలు వద్ద సొమ్ము దాచాడు. ఆ సొమ్మును తీసికొని రావడానికి కుమారుడైన తోబియాను పంపనిశ్చయించుకొన్నాడు.

ఆదినాన్నే మాదియా దేశంలోని ఎక్బటానా నగరంలో నివసించే రగూవేలు పుత్రిక సారా వరుసగా ఏడ్గురు భర్తలను కోల్పోయి దుఃఖంతో దేవునికి మొరపెట్టింది.