పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/151

ఈ పుట అచ్చుదిద్దబడ్డది



దేవునికి మాత్రమే దానిమార్గం తెలుసు
అది దొరికే తావని అతడు మాత్రమే చూచాడు
అతడు నేల నాల్లచెరగులూ పరిశీలిస్తాడు
మింటిక్రింద వున్న వస్తువులన్నిటినీ అవలోకిస్తాడు
ప్రభువు వాయువుకి బలాన్ని దయచేసినపుడు
జలరాశికి పరిమాణం విధించినపుడు
వానలు కురియడానికి నియమాలు చేసినపుడు
ఉరుములకీ మెరుపులకీ మార్గాలు నియమించినపుడు
విజ్ఞానాన్ని గూడ పరికించి చూచాడు
దాన్ని పరీక్షించి చూచి
అది తనకు సమ్మతమైనదేనని తెలియజేసాడు
ప్రభువు నరునికి యిూలా చెప్పాడు –
“దేవునికి భయపడ్డమే విజ్ఞానం
దుష్కార్యాలను విడనాడడమే వివేకం"

,


జ్ఞాన గ్రంథాల్లోని అతి ప్రశస్తమైన గీతాల్లో ఈ విజ్ఞాన గీతంకూడ వొకటి. విజ్ఞానం అమూల్యమైందని ఈ గీతం భావం. నరులు భూగర్భంలోకి ప్రవేశించి వెండి బంగారాలూ రత్నాలూ వెలికి తీస్తారు. కాని విజ్ఞానాన్ని మాత్రం కనుగొనలేరు. అది ప్రశస్తమైన లోహాలకంటె, అమూల్యమైన మణులకంటె విలువైంది. నరునికి విజ్ఞానాన్ని గూర్చి తెలియదు. దేవునికి మాత్రమే దాన్ని గూర్చి తెలుసు. విజ్ఞానమంటే యేమో కాదు. దేవునికి భయపడ్డమే.


కాని యిూ భయం ఏలాంటిది? సేవకుడు యజమానుణ్ణి చూచి భయపడతాడు. ఆ యజమానుడు తన్ను శిక్షిస్తాడేమోనని భీతిల్లుతాడు. జ్ఞానగ్రంథాలు పేర్కొనే దైవభీతి ఈలాంటిది కాదు. బిడ్డడు తల్లిదండ్రులమీద గల ప్రేమభావంచే వాళ్ళ ఆజ్ఞలుమీరి వాళ్ళ మనసు నొప్పించడానికి భయపడతాడు. జ్ఞానగ్రంథాలు పేర్కొనే దైవభీతి యీలాంటిది. విజ్ఞానంలోని ముఖ్యాంశం ఈ ప్రేమతో గూడిన దైవభీతే. 'ఈ దైవభీతినే యోబు గ్రంథకర్త అమూల్యమైన వరంగా యెంచాడు. ఈ వరాన్నే మనంకూడ పొందగలిగితే యెంతబాగుంటుంది!