పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/148

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవి ఆదాము సంతతి కంతటికీ ప్రాప్తించిన శాపాలు. కాని మన శ్రమలు నిష్ప్ర్యోజనం కావు. క్రీస్తు వేదనలు మన వేదనలను ఫలభరితం చేస్తాయి. అతని మరణం మన మరణాన్ని పునీతం చేస్తుంది. మృతుల పూజలో వచ్చే ప్రెఫేస్ ప్రార్ధనం చెప్పినట్లుగా, క్రీస్తునందు మరణించేవాళ్ల జీవితం అంతంకాదు. వాళ్లకు క్రొత్త జీవితం, అనగా పరలోక జీవితం, ప్రారంభమౌతుంది. కనుక కీడుల సమస్యకు పరిష్కారం క్రీస్తు సిలువవొక్కటే.

యోబు మొదలైన పూర్వవేద భక్తులకు క్రీస్తునిగూర్చి తెలియదు. అతని కష్టాలు మన కష్టాలను ఫలభరితం చేస్తాయనీ, మన కష్టాలకు అర్థముందనీ వాళ్లు గ్రహించలేదు, కనుక యోబు తన బాధలకు అర్థంతెలియక నిరాశతో క్రుంగిపోయాడు. కాని నేడు మనకు మన బాధలకర్థం తెలుసు. ఆదాము సంతతికి శ్రమలు రాక తప్పవనీ, ఐనా వాటివల్ల మనం క్రుంగిపోనక్కరలేదనీ కూడ మనకు తెలుసు. కనుక బాధలూ శ్రమలూ ఎందుకు అనే సమస్యకు యోబుకి తెలియని పరిష్కారం మనకు తెలుసు. ఐనా బాధలు వచ్చినపుడు ఆ యోబులాగే మనంకూడ తల్లడిల్లిపోతాం. అసలు అతనికున్న విశ్వాసం మనకుండదు. కనుక ఎప్పడో క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దంలో వెలువడిన యీ గ్రంథం నేటికీ తన ప్రాముఖ్యాన్ని కోల్పోలేదు. బాధల్లో వున్న వాళ్లకి ఈ గ్రంథం నేటికీ ప్రేరణం కలిగిస్తూనే వుంటుంది.

5. యోబు మరల సంపదలు పొందడం

ప్రభువు యోబు విశ్వాసాన్ని మెచ్చుకొన్నాడు. అతడు
“ప్రభువు దయచేసిన వాటినెల్ల మరల తానే తీసికొన్నాడు
అతని నామానికి సుతి కలుగునుగాక”

అని పల్కాడు - 1,21. ఇది చాల గొప్పభక్తి, అతడు తన పాలబడిన కష్టాలకు దేవునిమీద తిరగబడినా, దైవదర్శనాన్ని పొందాక తన దురుసుతనానికి పశ్చాత్తాపపడ్డాడు. దేవునికి లొంగాడు. ఆ ప్రభువుని గాఢంగా విశ్వసించాడు. జీవితంలో అన్ని సమస్యలకూ పరిష్కారం దైవవిశ్వాసమేనని గ్రహించాడు. ఈలా యోబు హృదయం మారింది. అతని దైవభక్తి బలపడింది. కనుక ప్రభువు సంతోషించి యోబుకి పూర్వసంపదలన్నీ మరల దయచేసాడు. రెట్టింపుగా గూడ దయచేసాడు. అతనికి మళ్ళా సంతానం కలిగింది, పసుల మందలు వృద్ధి చెందాయి. "ప్రభువు యోబు జీవితంలో పూర్వ భాగంకంటెగూడ ఉత్తరభాగాన్ని అధికంగా దీవించాడు” - 42.12. కనుక ప్రభువు నీతిమంతులను బహూకరిస్తాడు అనే పూర్వవేదసూక్తి నెరవేరింది.