పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/147

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసికోలేనని గ్రహించాడు. దేవుడు సర్వజ్ఞడనీ తాను అజ్ఞడననీ గుర్తించాడు. తనకు కష్టాలెందుకు వచ్చాయో తనకు తెలియకపోయినా దేవునికి తెలుసు, అది చాలు అనుకొన్నాడు.

యుబు భగవంతుణ్ణి దర్శించి ప్రత్యక్షానుభవం పొందాడు. ఆ యనుభవంవల్ల అతని విశ్వాసం బలపడింది. ఆ విశ్వాసం ద్వారా అతడు తన కష్టాలను అంగీకరించాడు. అవి దేవుడు పంపినవి. అవి తన కెందుకు దాపురించాయో తనకు తెలియకపోయినా, దేవుడే పంపాడు గనుక వాటిని అంగీకరించవచ్చు. దేవునిపట్ల విశ్వాసమే మన ప్రశ్నలన్నిటికీ జవాబు - ఇది యోబు గ్రంథరచయిత సూచించిన పరిష్కారం.

కాని యిది తృప్తికరమైన జవాబౌతుందా? లోకంలో మంచివాళ్ళకు కష్టాలెందుకు వస్తాయి? చెడ్డ అనేది సజ్జనులనెందుకు బాధిస్తుంది? ఈ ప్రశ్నలకు యోబు గ్రంథకర్త నిజమైన పరిష్కారం చూపించగలిగాడా?

బాధలెందుకు వస్తాయి, చెడ్డ అనేది యెందుకువుంది అనే ప్రశ్నలకు యోబు గ్రంథం పాక్షికమైన పరిష్కారం మాత్రమే సూచిస్తుంది. పూర్తి పరిష్కారం చూపించదు. పూర్తి పరిష్కారం ఈ గ్రంథకర్తకు తెలియదు. ఆ మాటకొస్తే, పూర్వవేద రచయితల కెవరికీ తెలియదు. కనుక బాధలెందుకు వస్తాయి అని ప్రశ్నవేయడం మాత్రమే ఈ గ్రంథకర్త చేసిన పని. దీనికి పూర్తి సమాధానం నూత్న వేదంలోని క్రీస్తునుండీ, అతని సిలువనుండీ వెతుక్కోవాలి.

4. క్రీస్తు సిలువనుండి సమస్యాపరిష్కారం

ఆదాము పాపంవల్ల శ్రమలూ మృత్యువూ లోకంలోకి ప్రవేశించాయి. అతని సంతతివాళ్ళమైన మనకు కూడ బాధలు తప్పవు. యోబు శ్రమలూ అతని మొరలూ మనందరి వేదనలను సూచిస్తాయి. ఆ పుణ్యపురుషుళ్ళాగే చాలమంది బాధలనుభవించారు. వాటిని భరించలేక అక్రోశించారుకూడ

క్రీస్తుకూడ ఆదాము సంతతికి చెందినవాడు. కనుక అతడుకూడ వేదనలకీ చావుకీ గురయ్యాడు. సిలువమీద ఘటోరయాతనలు అనుభవించి ప్రాణం విడచాడు. కాని అతడు నూత్న మానవజాతికి శిరస్సు. కనుక అతడు వ్యధలకీ మృత్యువుకీ లొంగిపోలేదు. చనిపోయిగూడ మృత్యుంజయుడై మళ్ళా వుత్తానమయ్యాడు.

నేడు మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినపుడు అతనితో ఐక్యమౌతాం. ఈ యైక్యతవల్ల అతడు ఆనాడు బాధలమీదా మృత్యువుమీదా సాధించిన విజయం నేడు మనకు సంక్రమిస్తుంది. అతడు మనకు శిరస్పని చెప్పాం. మనకు శ్రమలేమో తప్పవు.