పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/145

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యోబు బాధల సమస్యను ఎత్తుకోనేలేదు. అతడు తన తరపున తాను ప్రశ్నల వర్షం కురిపించాడు. నరునికి దేవుణ్ణి ప్రశ్నించే సామర్ధ్యంవుందా, అతనికి విజ్ఞానమూ శక్తి వున్నాయా అని యీ ప్రశ్నల భావం. లేవని వాటి అంతరార్థం. అల్పజ్ఞడైన యోబెక్కడ సర్వజ్ఞుడైన దేవుణ్ణి సవాలు చేయడమెక్కడ? పొట్టేలుబోయి కొండను ఢీకొన్నట్లుగా లేదా? కనుక యోబు తన వాదాన్ని ఉపసంహరించుకొని దేవునికి లొంగిపోయాడు. పూర్వం అబ్రాహాము యాకోబు మోషే యెషయా యిర్మియా మొదలైన మహాభక్తులకు దైవదర్శనాలు లభించాయి. ఆ దర్శనాలవల్ల వాళ్లు వినయం అలవర్చుకొన్నారు. యోబుకూడ వాళ్లలాగ వినమహృదయుడై

"నేను తెలివిమాలిన పల్ములు పల్మాను
ఇప్పడు నేను జవాబు చెప్పలేను గనుక మౌనం వహిస్తున్నాను
నేనొకసారి మాటలాడాను, మరల మాటలాడాను
ఒక్కసారికంటె అధికంగా సంభాషింపను”

అన్నాడు – 40, 4-5.

ఇక్కడ యోబుకి రెండనుభవాలు కలిగాయి. మొదటిది, అతడు తాను అజ్ఞానినని గుర్తించాడు. దేవుని మార్గాలు అతనికి తెలియవు. ఐనా తాను దేవునిముందు ఎగిరిపడ్డాడు. ఆ ప్రభువు సర్వశక్తిమంతుడు. సర్వమూ నిర్వహింపగల సమర్ణుడు. అతనికేదీ అడ్డురాదు. మంచివాళ్ళకు బాధలెందుకు వస్తాయో, వాటివల్ల ఏమి ప్రయోజనం సిద్ధిస్తుందో అతనికి తెలుసు. కనుక యోబు తొందరపడి నోరు పారవేసికోగూడదు. ఈ భావాలన్నిటినీ సూచిస్తూ అతడు

"ప్రభూ! నీవు సర్వశక్తిమంతుడివి
నీవు తలపెట్టిన కార్యాలెల్ల చేయగలవు
నాకు విజ్ఞానం చాలకున్నా
నేను నీ కార్యాలనుగూర్చి ప్రశ్నించాను
నా కర్థంగాని అంశాలనుగూర్చి సంభాషించాను
నేను గ్రహించజాలని మహాద్భుత విషయాలను గూర్చి
ఇంత తడవూ మదరాను?

అన్నాడు – 42, 2-4.

రెండవది, దేవుడు అతనికి ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చాడు. అతడు పూర్వం వాళ్ళ వీళ్ళ చెప్పిన మాటలను బట్టి దేవుడు అలాంటివాడు ఈలాంటివాడు అనుకొనేవాడు.