పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/126

ఈ పుట ఆమోదించబడ్డది

1. యోబు పరీక్షలు

1. సమస్య

అన్ని కాలాల్లోను అన్ని దేశాల్లోను నరులు బాధలకు గురౌతూనే వచ్చారు. విశేషంగా మంచివాళ్ళు బాధలకు గురికావడం చాలమందికి ఆశ్చర్యం కలిగించింది. సజ్జనుడు శ్రమలెందుకు అనుభవించాలి అనే ప్రశ్నకు ప్రపంచంలో చాలమంది తాత్వికులు సమాధానం ఆలోచించారు.

పూర్వవేదం, భగవంతుడు దుషులను వ్యాధి బాధలతో దండిస్తాడనీ వాళ్ళకు ప్రస్వకాలిక జీవితాన్ని మాత్రమే దయచేస్తాడనీ చెప్తుంది. సజ్జనులకు సుఖాలూ దీర్ఘకాలిక జీవితమూ ప్రసాదిస్తాడనీ వాకొంటుంది. కాని నిత్యజీవితంలో ఈ సూత్రం తారుమారయిందేమో ననిపిస్తుంది. దుషులు సుఖభోగాలతో దీర్ఘకాలం జీవిస్తున్నారు. సజ్జనులను శ్రమలు దాపరిస్తున్నాయి. వాళ్ళు అకాలమృత్యువువాత బడుతున్నారు. మరి దేవుని న్యాయం ఏమైనట్లు? ఈ సమస్యనే యిర్మీయా ప్రవక్త యిలా వ్యక్తం చేసాడు.

       "ప్రభూ! నీవు న్యాయం తప్పేవాడివి కాదు
        ఐనా నేను నీకు ఫిర్యాదు చేస్తున్నాను
        దుషులు వృద్ధిలోకి రానేల?
        ద్రోహులు అభివృద్ధి చెందనేల?
        నీవు వాళ్ళను మొక్కల్లా నాటగా
        వాళ్ళు ఎదిగి పండ్లు ఫలిస్తున్నారు
        నీవు వాళ్ళ పెదవులమీద వున్నావుగాని
        వాళ్ళ హృదయాల్లో లేవు" - 12, 1-2

దుర్మారులకు సుఖాలెందుకు నీతిమంతులకు కష్టాలెందుకు అనే ప్రశ్న బహు ప్రాచీనమైంది. అధునాతనమైంది కూడ. ఇన్నివేల యేండ్లనుండి మేధావులు ఈ ప్రశ్నకు జవాబును ఆలోచిస్తున్నానేటికీ దీనికి తృప్తికరమైన సమాధానం లభించదు. ఈ సమస్యకు పరిష్కారం సూచించడానికే యోబు గ్రంథంకూడ పుట్టింది. సామాన్య పాఠకులకు ఈ పుస్తకం సులభంగా అర్థంకాదు. ఐనా దీనిలో చాల లోతైన భావాలున్నాయి. ఈ పుస్తకంలోని ప్రశస్త భావాలను కొన్నిటినయినా మన పాఠకలోకానికి అందించాలన్న తపనతోనే ఈ చిన్ని పొత్తాన్ని తయారుచేసాం.