పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/124

ఈ పుట ఆమోదించబడ్డది

నిరంతరం గుర్తు చేస్తుండేది. నూత్న వేదంలో క్రీస్తు సాన్నిధ్యం మనలను నడిపిస్తుంటుంది. విశేషంగా దివ్యసత్రసాదంలో అతని సాన్నిధ్యం అతిబలంగా పనిచేస్తుంటుంది.

3. యిస్రాయేలుకు దేవుడు నియమించిన నాయకుడు మోషే, అతడు స్వార్థంలేని సేవామూర్తి, ప్రజలకు దేవుని చిత్తాన్ని తెలియజేసే ప్రవక్త. వారి తరపున మాటిమాటికి విజ్ఞాపనంచేసే ప్రార్థనామూర్తి. దేవుని రూపం చూచినవాడు. అతనికి స్నేహితుడు. నూత్న వేదంలో మన క్రీస్తే మోషే. మోషే పవిత్ర గుణాలన్నీ ఇంకా అధికంగా క్రీస్తులో వున్నాయి. ఈ క్రీస్తు నాయకుణ్ణి అనుసరిస్తే మనం తప్పకుండా దివ్యధామం చేరతాం. అతడు మోషే యెత్తిన సర్పంలాగా సిలువ మీదికి ఎత్తబడినవాడు.

4. యిస్రాయేలు ప్రజలు మాటిమాటికి దేవునిపై తిరుగుబాటు చేసేవాళ్ళు. ప్రయాణంలో చిన్నచిన్న కష్టాలు ఎదురవగానే మోషేను నిందించేవాళ్ళు ఈజిప్టులో సముద్ర ఉత్తరణంలో ప్రభువు చేసిన అద్భుత కార్యాలను పరిగణించేవాళ్లు కాదు. కడకు దేవుడు వారితో విసిగిపోయి మీలో ఒక్కడుకూడ కనాను దేశంలో అడుగుపెట్టడని శపథం చేసాడు. కడన కాలెబు యోషువాలు మాత్రమే ఆ దేశాన్ని చేరుకొన్నారు. ఈ ప్రజల్లాగ మనం దేవునిపై తిరుగుబాటు చేయకూడదు. అతడు మనకు చేసిన నానా వుపకారాలను తలంచుకొని అతన్ని నమ్మడం నేర్చుకోవాలి. కష్టాల్లో అతనికి విధేయులం కావాలి.

5. ఈ గ్రంథంలోని అంశాలను కొన్నిటిని నూత్నవేదం పేర్కొంటుంది. అక్కడ దేవుడు ప్రజల మధ్య వసించడాన్ని మనసులో పెట్టుకొనే యోహాను "వాక్కు మానవుడై మన మధ్య వసించాడు" అని వ్రాసాడు -1,14. మోషే కంచు సర్పాన్ని గడెమీదికి ఎత్తడానికి క్రీస్తుని సిలువమీదికి ఎత్తడానికీ పోలిక వుంది. - 3,14-15, యెడారిలో దేవుడిచ్చిన మన్నాకీ మన దివ్య సత్రసాదానికీ సామ్యం వుంది. ఎడారిలో యిస్రాయేలీయుల శోధనలకూ నేటి మన శోధనలకూ పోలిక వుంది. పౌలు భక్తుడు యిస్రాయేలీయుల ఏడారి శోధనలు మనకు కూడ వస్తాయని చెప్పాడు - 1 కొ 10, 1–11. కనుక సంఖ్యా కాండంలోని అంశాలు నేటికీ మన జీవితంలో కొనసాగుతూనే వున్నాయి అని చెప్పాలి.

6. మోషే రాతిబండను చవరగా దానినుండి అద్భుతంగా నీళ్లు పారాయి - సంఖ్యా 20,11. ప్రాచీన క్రైస్తవ రచయితలు ఈ రాతి బండలో, సిలువమీద తెరవబడిన క్రీస్తు ప్రక్కను చూచారు. రాతిబండనుండి నీళ్ళు వెలువడినట్లే క్రీస్తు ప్రక్కనుండికూడ నీళ్లు వెలువడ్డాయి - యోహా 19,34. ఈ నీళ్ళ పవిత్రాత్మ జ్ఞానస్నాన జలాలు. ఈలా సంఖ్యా కాండ క్రైస్తవులమైన మనకు ఎన్నో మంచి జ్ఞాపకాలు ప్రేరణలు పుట్టిస్తుంది.

116