పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/116

ఈ పుట ఆమోదించబడ్డది

ఆడిపోసికొంటాయి. నీవు ఈ ప్రజను వాగ్డత్త భూమికి చేర్చలేకనే వారిని చంపివేసావు అంటారు. నీకు అపకీర్తి వస్తుంది. శిక్షించడంకంటె క్షమించడం ద్వారా నీకు ఎక్కువ కీర్తివస్తుంది అని విన్నవించాడు. ఇక్కడ 18-19 వచనాలు అద్భుతమైనవి, పలుసార్లు చదువదగినవి.

ప్రభువు ప్రజల అపరాధాన్ని క్షమించాడు. కాని కాలేబు యోషువాలు తప్ప ఆ తరంవాళ్ళెవరూ కనాను దేశంలో అడుగుపెట్టరని చెప్పాడు. వేగు చూడబోయినవాళ్ళు 40రోజులు కనానుదేశంలో వున్నారు. కనుక ఆ ప్రజలు కూడ 40 ఏండ్లు ఎడారిలో తిరుగాడి అక్కడే చస్తారన్నాడు. ఆ జనంలో 20 ఏండ్లలోపులో వున్నవాళ్ళు మాత్రం రెండవ తరంగా కనాను దేశంలో అడుగుపెడతారని చెప్పాడు. వాళ్ళకూడ తండ్రుల పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తూ 40 ఏండ్లు ఎడారిలో తిరుగుతారని పల్కడు. వేగుచూచి వచ్చినవాళ్ళు అక్కడికక్కడే రోగంతో చచ్చారు. ప్రజలు 40 ఏండ్ల దీర్ఘకాలం ఎడారిలో గడపడానికి కారణం ఇదే.

14, 39-45 వచనాలు తిరుగుబాటులో ఇంకో తిరుగుబాటు. ప్రజలు యావే శాపానికి భయపడి అప్పటికప్పుడే కనాను దేశానికి వెళ్ళి దాన్ని జయిద్దామనుకొన్నారు. కాని మోషే వారిని అలా వెళ్ళవద్దనీ, అది దేవుని చిత్తం కాదనీ వారించాడు. మందసం కూడ వారితో పోలేదు. ఐనా వాళ్ళు మూర్ధంగా యుద్దానికి పోయారు.కాని కనానీయులు వారిని ఓడించి తరిమికొట్టారు.

ఈ యధ్యాయాలు యిస్రాయేలు ప్రజల తలబిరుసునీ, తిరుగుబాటునీ బాగా చిత్రిస్తాయి. మనకు ఈలాంటి ప్రవర్తనం తగదు. ప్రభువు ప్రమాణాలను శంకించకూడదు. అతనిమీద తిరుగుబాటు చేయకూడదు. అతని నిబంధనాన్ని నమ్మాలి.

5. కోరా, దాతాను అబీరాముల తిరుగుబాటు 16–17

మిర్యాము తిరుగుబాటు కుటుంబం లోపలినుండి వచ్చింది. ఇక్కడి తిరుగుబాటు కుటుంబం వెలుపలినుండి వచ్చింది. ఇక్కడ రెండు కథలున్నాయి. బైబులు రచయితలు ఈ రెండింటిని కలిపివేసారు. కాని మనం వీటిని వేరువేరుగా చూడాలి.

మొదట కోరా కథ. ఇతడు లేవీ తెగకు చెందిన యాజకుడు. గుడారంలోని పాత్రలు మోసికొనిపోవడం ఇతని పని. కాని ఇతనికి యాజకపదవిని పొందాలని కోరిక పట్టింది. కనుక తన అనుచరులు 250 మందిని ప్రోగుజేసికొని మోషేమీద తిరగబడ్డాడు. మోషే కోరా బృందాన్ని అహరోనుని కలశాల్లో నిప్పలు పోసికొని గుడారంలోకి రమ్మన్నాడు.