పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/111

ఈ పుట ఆమోదించబడ్డది

వుంచుతాడు. తాను అతనితో సాయంకాలపు చల్ల గాలికి షికారుకు వెళ్తాడు - ఆది 3,8. అతడు తన చేతితోనే నోవా వోడ తలుపు మూసివేస్తాడు - 7, 16, అబ్రాహాము ఇంటిలో స్వయంగా భుజిస్తాడు - 18.8. సౌదొమ గొమర్రా పట్టణాలను పరిశీలించడానికి వెళ్తాడు- 18,20. ఈ సంప్రదాయం రచయితలు పేర్లకు వ్యత్పత్తి అర్థం చెపుతారు. ఏవ అనేపదానికి జీవుల తల్లి అని అర్ధం - 3,20. ఏసావు అనే మాటకు రోమమయుడు అని అర్థం - 25.25. వీళ్ళ రచనలో సంభాషణలో నాటకీయశైలి వాడతారు. నరుల మానసిక పరిస్థితి వ్యక్తీకరించడంలో దిట్టలు. వీళ్ళ శైలి మూర్తిమంతంగాను చదవడానికి ఆకర్షణీయంగాను వుంటుంది.

2) ఎలోహిము సంప్రదాయం

వీళ్లు దేవుణ్ణి ఎలోహిం అని పిల్చారు. ఈ రచయితలు దేవునిపట్ల అంత చనువు చూపరు. దేవునికీ నరునికీ మధ్య చాల అంతరమున్నట్లుగా వర్ణిస్తారు. భగవంతుడు నరులతో కలలద్వారాగాని దూతలద్వారాగాని మాటలాడతాడు. వీళ్ళకు ప్రవక్తలంటే యిష్టం. యావే సంప్రదాయం దేవుణ్ణి యావే అంటే వీళ్లు ఎలోహిం అంటారు. ఆ సంప్రదాయంలోని "సీనాయి” “యిత్రో" అనే పేర్లను వీళ్లు “హోరెబు” “హోబబు" అని పేర్కొన్నారు.

3) యాజక సంప్రదాయం

వీళ్లకు ధర్మశాస్త్రమూ ఆరాధనా అంటే అభిమతం. వంశవృక్షాలూ కాలమానాలు పేర్కొంటారు. వీళ్లు భగవంతుణ్ణి భయంకరుణ్ణిగాను మహా పవిత్రుణ్ణిగాను చిత్రిస్తారు. నరుడు దేవుని దగ్గరకు వెళ్ళలేడని వీళ్లభావం. ఈ రచయితల శైలి అమూర్తంగా వుంటుంది. పునరుక్తులతో నిండివుంటుంది. చదవడానికి అంత ఆకర్షణీయంగా వుండదు. ఐనా వీళ్లు గొప్ప దైవశాస్త్రజ్ఞలు.

4) ద్వితీయోపదేశ సంప్రదాయం

ఈ రచయితలు మోషేకు ప్రాముఖ్యమిచ్చారు. ద్వితీయోపదేశ గ్రంథమంతా ఈ సంప్రదాయానికి చెందిందే. వీళ్ళ రచన ఉపన్యాస ధోరణిలో వుంటుంది. ఉదాత్తమైన శైలిని వాడారు. మచ్చుకు వీళ్ళ ప్రయోగాలు కొన్ని: దేవుణ్ణి పూర్ణ హృదయంతోను, పూర్ణాత్మతోను, పూర్ణశక్తితోను ప్రేమించాలి. మీరు ఐగుప్తూ లో బానిసలుగా వుండేవాళ్లు, పాలూ తేనెలూ ప్రవహించే నేల, దాస్యగృహం. యావే చాచిన బాహువుతో మిమ్ము విమోచించాడు. యిప్రాయేలూ విను - మొదలైనవి.

నేడు బైబులు పండితులు ఆదిపంచకంలోని ఐదుగ్రంథాల్లో ఏ వాక్యాలు ఏ సంప్రదాయానికి చెందినవో విభజించిచూపగలరు.