పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

722 ప్రాంతంలో ఉత్తరాది పండితులు వాళ్ళ గ్రంధాన్ని పాలస్తీనా దక్షిణ భాగానికి తీసికొనివచ్చారు. కనుక వాళ్ళ ఎలోహిం సంప్రదాయగ్రంథం దక్షిణదేశంలోని యావే సంప్రదాయగ్రంథంతో మిళితమైపోయింది. ఈ రెండూ కలసి యావే ఎలోహిం గ్రంథం ఏర్పడింది. దీన్ని నేడు విద్వాంసులు "JE" అని పిలుస్తారు.

8వ శతాబ్దంలోనే ఔత్తరాహులైన యాజకులు జాతీయేతీహాసాన్ని మరో గ్రంథంగా - . తయారు చేసారు. వీళ్ళు మోషేకు ప్రాముఖ్యమిచ్చారు. వీళ్ళ గ్రంథానికి ద్వితీయోపదేశ సంప్రదాయం అని పేరు. ఇప్పడు బైబులుపండితులు దీన్ని "D" అని పిలుస్తారు.

6వ శతాబ్దంలో యెరూషలేములోని యాజకులు పైకథనే మరో గ్రంథంగా వ్రాసారు. వీళ్లు యాజకులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారు. వీళ్ళ గ్రంథానికి యాజక సంప్రదాయం అనిపేరు. ఇప్పడు పండితులు దీన్ని "P" అని పిలుస్తారు. కనుక ఆరవ శతాబ్దంనాటికి మోషే ముఖతః చెప్పిన కథ పాలస్తీనా దేశంలో నాల్లు గ్రంధాలుగా ప్రచారంలోకి వచ్చింది.

3. ఈలావుండగా 5వ శతాబ్దంలో ఒక సంధాత ఈ గ్రంధాలన్నిటినీ కలిపివేసాడు. అతని నాటికే యావే ఎలోహిం సంప్రదాయాలు కలసివున్నాయి. అతడు యాజక సంప్రదాయాన్నిగూడ ఈ గ్రంథంతో మిళితం చేసాడు. ద్వితీయోపదేశ సంప్రదాయాన్ని మాత్రం అనుబంధంగా గ్రంధాంతంలో చేర్చాడు. కనుక అతడు jEP + D అనే పద్ధతిలో నాల్గు గ్రంథాలు కలిపి ఏకగ్రంథంగా తయారుచేసాడు.

క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం తర్వాత మరో రచయిత ఈ యేకగ్రంథంమీద కృషిచేసాడు. అతడు సంప్రదాయాలనుబట్టి పోలేదు. ఇతివృత్తాన్నిబట్టి పోయాడు. కథనుబట్టి ఈ యేక గ్రంథాన్ని ఐదు పుస్తకాలుగా విభజించాడు. ఇవే నేడు మనకు లభ్యమయ్యే ఆదికాండం మొదలైన ఆదిపంచకం. ఈ చివరి పద్ధతిలో ఒకే పుస్తకంలోనే పై నాలు సంప్రదాయాలూ ఇమిడివుండడం జరిగింది. ఉదాహరణకు ఒక్క ఆదికాండంలోనే అన్ని సంప్రదాయాల రచనా కన్పించవచ్చు.

2. నాల్గు సంప్రదాయాల లక్షణాలు

పై నాల్గు సంప్రదాయాల్లోను భిన్నభిన్న లక్షణాలు గోచరిస్తాయి. ఒక్కో సంప్రదాయంవాళ్లు ఒక్కో అంశానికి ప్రాముఖ్యమిస్తూ వచ్చారు. ఆదిపంచకాన్ని బాగా అర్థం చేసికోవాలి అంటే ఈ యైదుపుస్తకాల్లో ఏభాగం ఎవరి సంప్రదాయానికి చెందిందో తెలిసివుండాలి. ఈ క్రింద సంప్రదాయ లక్షణాలను క్లుప్తంగా పేర్కొంటున్నాం.

1) యావే సంప్రదాయం

ఈ సంప్రదాయంవాళ్లు దేవుణ్ణి యావే అని పిలుస్తారు. వాళ్ళకు భగవంతునిపట్ల చాల చనువు వుంటుంది. అతన్ని ఓ నరుణ్ణిగా వర్ణిస్తారు. యావే నరుద్ధి చేసి తోటలో