పుట:Bible Bhashya Samputavali Volume 01 Bible Parichayam P Jojayya 2003 308 P.pdf/109

ఈ పుట ఆమోదించబడ్డది



9. ఆదిపంచకమూ, నాల్గు సంప్రదాయాలూ

1. రచనా చరిత్ర

ఈ పుస్తకంలోని 6వ అధ్యాయంలో సముద్రోత్తరణను గూర్చి చెప్పేపుడు యావే యాజక సంప్రదాయాలను పేర్కొన్నాం. ఈ చివరి అధ్యాయంలో వీటినిగూర్చి సంగ్రహంగా తెలిసికొందాం.

బైబుల్లోని తొలి ఐదుపుస్తకాలకు ఆదిపంచకం అని పేరు. ఇవి ఆది, నిర్గమ, లేవీయ, సంఖ్యా, ద్వితీయోపదేశ కాండలు. యూదుల సంప్రదాయంలో వీటికన్నిటికి కలిపి 'టోరా" అని పేరు. టోరా అంటే ఉపదేశం. అనగా ఈ యైదు పుస్తకాలు మోషే వుపదేశమని యూదుల భావం. ఐనా మోషే ఈ ධුසංධිරහීඑ* ఒక్కటికూడ వ్రాయలేదు. ఈ పుస్తకాలు తయారుకావడానికి ఇంచుమించు 800 ఏండ్లు పట్టింది. ఎన్నో తావుల్లో ఎందరో రచయితలు చేసిన కృషివల్ల ఈ గ్రంథాలు వెలువడ్డాయి. మొదటిరోజుల్లో ఆదిపంచకం నేడున్నట్లుగా లేదు. ఆదిపంచక గ్రంధాలు అవతరణంలో మూడు దశలు గోచరిస్తాయి.

1. క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో యూదులు మోషే నాయకత్వం క్రింద ఐగుపునుండి వెడలివచ్చాడు. ఈ కథను మోషే సంగ్రహంగా చెప్పాడు. ఇది యూదుల జాతీయేతిహాసం అయింది. కాని ఈ యితిహాసం లిఖితం కాలేదు. ముఖతః మాత్రమే ప్రచారంలో వుండేది. అనగా తాతలూ తండ్రులూ కుమారులూ ఒకరికొకరు ఈ కథను చెప్పకొంటూ పోయేవాళ్లు ఈలా మూడువందల యేండ్లపాటు ఈ కథ ముఖతః ప్రచారంలోవుంది. పూర్వం ఇండియాలో వేదాలూ భారత రామాయణాది ఇతిహాసాలుకూడ ఈలాగే ముఖతః ప్రచారంలో వుండేవి.

2. క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలో పాలస్తీనా దక్షిణ భాగానికి చెందిన పండితులు ఈ యైగుప్త నిర్గమన కథను మొట్టమొదటిసారిగా హీబ్రూ భాషలో గ్రంథస్థం చేసారు. ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఈ కథ ఏకగ్రంథంగా వుండేది. వాళు దేవుణ్ణి “యావే" అని పిల్చారు. కనుక దీనికి యావే సంప్రదాయం అనిపేరు. నేడు బైబులు విద్వాంసులు ఈ సంప్రదాయాన్ని “J” అని పిలుస్తారు.

8వ శతాబ్దంలో పాలస్తీనా ఉత్తరభాగానికి చెందిన పండితులు పై జాతీయేతిహాసాన్ని మరో గ్రంథంగా వ్రాసారు. వాళ్లు దేవుణ్ణి "ఎలోహిం” అని పేర్కొన్నారు. కనుక దీనికి ఎలోహిం సంప్రదాయం అని పేరు. నేడు పండితులు దీన్ని "E" అని పిలుస్తారు.